Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడుచేఁపలకథ.

1083

జాలరులు పట్టుకొని చంపివేసిరి. కావున నేనును నాప్రజ్ఞ చేత సముద్రమువలని యాపదను తప్పించెదను గాని భయపడి ఆవలికి పోఁజాలను.” అని వచించి టిట్టిభము ఆ గూఁటనే యుండెను.

సముద్రుఁడు ఆ లకుముకి యహంకార వచనములను వినెను. టిట్టిభియు కొన్నాళ్లకు పిమ్మట గ్రుడ్లు పెట్టెను. అంతట సముద్రుఁడు 'చూతము. ఈ టిట్టిభము ఏమి చేయఁగలదో!' అని కుతూహలముచేత ఆ గ్రుడ్లను అపహరించెను. అంతట టిట్టిభి ఏడ్చుచు, 'నేను ముందే చెప్పిన యపాయము కలుగనే కలిగినది, చూచితివా?' అని పతితో మొఱ పెట్టెను. ధీర మయిన యా టిట్టిభము భార్యతో "పాపాత్ముని ఈసముద్రుని ఏమి చేసెదనో, చూడు.' అని, పక్షుల నన్నిటిని సభ కూర్చి తనకుఁ గలిగిన పరాభవమును తెలిపెను. అంతట పక్షు లన్నియు గుంపుగాఁ బోయి గరుడునితో 'దేవా, నీవు మాయేలిక వై యుండ, సముద్రుఁడు మాగ్రుడ్లను హరించి మమ్ము అవమానపఱిచినాఁడు.' అని మొఱ పెట్టినవి. గరుడుఁడు కోపగించి విష్ణుదేవునితో చెప్పుకొనెను. దేవుఁడు ఆగ్నేయాస్త్రప్రయోగముచే సముద్రమును ఇగురఁగొట్టి సముద్రునిచే టిట్టిభికి అండములను ఇప్పించెను.

కావున ఆపత్కాలమందు బుద్ధిమంతుఁడు ధైర్యమును వదలఁగూడదు. ఇప్పుడు నీకు పింగళకునితో పోరు పొసఁగినది. పింగళకుఁడు ఎప్పుడు తోక నిక్కఁబెట్టుకొని నాలుగుపాదములతోను సమముగా లేచునో అప్పుడే అతఁడు నిన్నుఁ గొట్టు నని