Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నల్లియు చీర పేనును.

1077

అకాలమందు రాజును కఱవఁగూడదు, అతఁడు నిద్రలో నున్నపుడుగాని రతాసక్తుఁ డై యున్నప్పుడు గాని, మృదువుగా కఱవ వలయును.' అనెను. టీటిభము అందుల కంగీకరించి అచటనే యుండి రాత్రి శయ్యాగతుని ప్రభువును అవసరపడి కఱచెను. అతఁడు 'అబ్బా ! ఏదో కఱచినది!' అని అఱచుచు లేచెను. అంతట మత్కుణము శఠము పాఱి పోయినది; రాజభృత్యులు వెదకి మందవిసర్పిణి దొరకఁగా దానిని నలిపి వేసిరి. ఇట్లు టీటిభముతోడి సహవాసమువలన మందవిసర్పిణి మరణము నొందినది. అట్లే సంజీవకుని సహవాసముచేత నీకును ప్రాణ గొడ్డము కలుగును. నా మాటను సమ్మవేని ఆ సంజీవకము నీయొద్దకు వచ్చినప్పుడు అది శూలములవలె వాఁడు లయిన తనకొమ్ములను చిమ్ముటను నీవే ప్రత్యక్షముగా చూడఁగలవు.

ఇట్లు దమనకుఁడు బోధింపఁగా లోఁబడి పింగళకుఁడు సంజీవకమును చంప నిశ్చయించుకొనెను. పింగళకుని యభిప్రాయమును తెలిసికొని దమనకుఁడు క్షణములో సంజీవకుని యొద్దకు చింతాక్రాంతుఁడుంబోలె పోయెను. 'మిత్త్రమా, దమనకుఁడా, ఏమి యిట్లున్నావు ? నీకు ఆరోగ్యమా?' అని సంజీవకుఁ డడిగెను. 'మిత్త్రమా, ఏల యడిగెదవు. సేవకుఁడయిన వానికి కుశల మెం దయినం గలదా ? రాజుల కెవఁడు సదా ప్రియుఁ డగును? యాచకునికి లాఘవము తప్పునా? కాల గోచరము కానివాఁ డెవఁడు?' అని దమనకుఁడు పలికెను.