1066
కథాసరిత్సాగరము. లం. 10. త. 4.
చుండెను. ఆసవిూపమున ఒక సింహము పింగళక మనునది పరాక్రమముచే అడవినెల్ల ఆక్రమించి యేలుచు ఒక గుహలో నివసించి యుండెను. ఆ మృగరాజునకు ఇరువురు నక్కమంత్రు లుండిరి. ఒకనిపేరు కరటకుఁడు, రెండవవాఁడు దమనకుఁడు. ఆసింహమే ఒకప్పుడు జల పానార్థము యమునాతటమునకు వచ్చి చెంతనుండి పర్విన సంజీవకునిఱంకెను వినెను. అశ్రుత పూర్వమై దిక్కులు పిక్కటిల్ల వ్యాపించుచున్న యానాదమును విని సింహము 'ఆహాహా! నాదమే యీవిధముగా నున్నది? నిశ్చయముగా ఈచెంత నేదో గొప్పజంతువు ఉన్నది. అది నన్ను చూచిన, తత్క్షణము చంపును. లేదా, ఈయడవినుండి తఱుమును.' అని తలపోసి జలము త్రాగకయే మరలి అడవి చొచ్చి తనచింతను అనుచరులకు తెలుపక భయముచే దాఁగి యుండెను. అంత నతనిమంత్రిప్రాజ్ఞుఁడు దమనకుఁడు రెండవ మంత్రి యగు కరటకునితో 'భద్రా, మనదొర జలపానార్థము పోయి త్రాగకయే వడివడిగా వచ్చినాఁడు. ఇందుల కారణమును మనము అడిగి తెలిసికోవలయును.' అనెను. అంతట, కరటకుఁడు 'ఇ దేమి మనపనియా ? నీవు మేకు పెఱికిన కోఁతి కథను వినలేదా?' అని యాకథను చెప్పఁ దొడంగెను.
మేకుపెఱికినకోఁతి కథ.
ఒకానొకనగరములో వర్తకుఁ డొకఁడు విస్తారము కలప తెప్పించి దేవాలయము కట్టించుచుండెను. అచట పనివాండ్రు