Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1052

కథాసరిత్సాగరము. లం. 10. త. 3.

కొనలేక ఆచెట్టును చూచి ఎక్కి గూండ్లలోనుండి శుకములను ఇతర పక్షులను వెలికిఁ తీసి మెడనులిమి చంపి క్రిందపాఱవైచు చుండెను. యమకింకరుఁడో యన చెంతకు వచ్చుచున్న వానిని కని నేను నాయన ఱెక్కల దాఁగితిని. ఇంతలోపల పాపాత్ముఁడు మాగూఁటికి వచ్చి నాయనను మెడ నులిమి చెట్టు మొదట పాఱవేసెను. నేనును నాయనతోఁగూడ నేలఁ బడి ఆయనఱెక్కలనుండి వెలువడి భయముతో ఆకులనడుమఁ దూఱితిని, భిల్లుఁడు చెట్టు దిగి కొన్ని చిలుకలను నిప్పుతో కాలిచి భక్షించి కడమవానిని కొని పల్లికి పోయెను.

అంత నేను భయము తీఱి దుఃఖదీర్ఘము నా రాత్రిని ఎట్లో గడపి సూర్యోదయము కాఁగానే ఱెక్కలు నేలకుఁ దగుల ప్రాఁకుచు, దప్పి గలిగి, చెంత నున్న పద్మాకరమునకు పోయితిని. అచట స్నాతుఁడై ఇసుకతిన్నెయందు నా పూర్వ పుణ్యరాశియో యన నున్న మరీచిమహర్షిని కంటిని. ఆయన నన్ను చూచి ఓదార్చి, నానోట నీటిబొట్లు పోసి సేద దేర్చి, కనికరముతో నన్ను ఆకుపుటములో పెట్టి ఆశ్రమమునకుఁ గొని పోయెను. అచట కులపతి పులస్త్యుఁడు 'నన్నుఁ జూచి నవ్వెను. ఇతరమునులు అడుగఁగా దివ్యదర్శనుఁడు పులస్త్య ముని యిట్లనియె. 'శాపచ్యుతుఁ డై శుక మయిన వీనిని గని నేను నవ్వితిని. వీనికథను ఆహ్నిక మైన పిమ్మట చెప్పెదను. దానిని విని వీఁడు పూర్వజన్మ వృత్తాంతమును స్మరించును.