Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1420

కథాసరిత్సాగరము. లం. 12. త. 8.

రూపుఁ డొకఁడు మోచి తెచ్చుచుంటం గని మృగాంకదత్తుఁడు ఆవింత నితరులకు చూపునంతలో విక్రమకేసరి వాని బుజమునుండి మృగాంకదత్తుని చెంత దిగి తనమోమున ఆనందాశ్రువులు వెల్లిగొన ఏలికపాదములకుం బ్రణతిసేసెను. అతండును హృష్టుఁడై యతనిం గవుంగిలించెను. ఇట్లు కడమ మంత్రులును అతని సంభావించిన యనంతరము విక్రమకేసరి యాపురుషుని తాను స్మరించినప్పుడు రావలసిన దని యాజ్ఞాపించి పంపి వేసెను. అందఱును కూర్చుండిరి. అంతట మృగాంకదత్తుఁ డడుగఁగా విక్రమ కేసరి తనవృత్తాంత మిట్లు చెప్పసాగెను. అపుడు నాగశాపమున మిమ్మెడఁబాసి పెక్కుదినములు వెదకియు మిమ్మెచటనుం గానక, మీరెల్ల నుజ్జయినికే గదా పోవుదురు, అటకే పోయిన మిమ్ముఁ గందు నని, నేను ఉజ్జయినికి పయనమై దానిచెంత బ్రహ్మస్థల మను నొక యూరివఱకుం బోయి అచట నొక బావి గట్టున చెట్టునీడలో కూర్చుంటిని. అంత నటకు పాముకాటున నొగులుచు నొక ముసలి బ్రాహ్మణుఁడు వచ్చి నన్నుఁ గని 'పుత్త్రా, ఇక్కడ నుండకు, లే, నాగతి నీకు నయ్యెడిని. ఇట నొకమహాసర్ప మున్నది అది నన్నుఁ గఱవఁగ నోవు సైఁపజాలక నే నీనీట దేహము విడువ వచ్చితిని.' అని హెచ్చరించెను. అంత నేను కనికరించి యతని మరణోద్యోగమును మాన్చి విషవిద్యచే నతని నిర్విషునిఁ జేసితిని. అంతట నావిప్రుఁడు నావృత్తాంతము అక్కఱగా నడిగి విని ప్రీతుఁడై