Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1416

కథాసరిత్సాగరము. లం. 12. త. 7.

కైపోర నేర్పరు లయిన చండభుజంగాది వీరాగ్రేసరులతోను, దుర్మదద్విరదములతోనుంబోలె విలుకాఁ డగు భీమభటుఁడు సమరభటునిదండును విఱిగి పరారి అగునట్లు కొట్టెను. సైన్యమిట్లు విఱిగిపోవ సమరభటుఁడు రథస్థితుఁడై కోపమున పోరి మున్నీటిలో కవ్వంపుమలవోలె తిరుగసాగెను. అంతట భీమభటుఁడు ఏనుంగుమీఁద వానిం బయికొని వానివింటినిత్రుంచి యలుఁగుల తేరిగుఱ్ఱములునాలుగింటిని గెడపెను. అంతట సమరభటుఁడు తేరు వదలి పరువున వచ్చి తోమరముతో భీమభటుని యేనుఁగును కుంభముపైఁ గొట్టెను. ఆదెబ్బకు ఏనుఁగు నేలఁగూలెను. అంత నిరువురు పదాతులై కత్తిపో రారంభించిరి. సమరభటునిం గొట్టుటకు విద్యాప్రభావముచేత కంటి కగపడకుండ మఱుఁగుపడ శక్తుఁడయ్యును, ధర్మ మాలోచించి భీమభటుఁడు శత్త్రువు నట్లు చంపలేదు. కత్తిపోర దంటయై యా నర్తకీసుతునితలం దునిమెను. అంతట నింగిని సిద్ధచారణుల సాధువాదములు వెలయ, యుద్ధము తుదముట్టఁగా, వందిమాగధులు జయమునుపొగడుచుండఁగా, మిత్త్రులతోఁగూడ భీమభటుఁడు రాఢాపురీప్రవేశ మొనర్చెను. చిరకాల మెటకో పోయియుండి అరిని రూపుమాపి వచ్చి తల్లిని తనకై తహతహ పడుచున్న దానినిభీమభటుఁడు అలకౌసల్యనుశ్రీరాముఁడువోలె దర్శించి యానందాంబుధిం దేల్చెను. తనజయమునకు పౌరు లలర గుణానురక్తులై పూర్వమంత్రులు తన్ను గారవింప భీమ