Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1414

కథాసరిత్సాగరము. లం. 12. త. 7.

దూతచే కమ్మ పంపెను. 'మూర్ఖా, ఆటకత్తె కొడుకా, మానాయన సింగంపుగద్దియపైఁ గూర్చుండ నీవెవఁడవు? ఈలాట రాజ్య మున్నను ఆగద్దియ నాది, కావున నీవు దానిం దఱియకుము.' దూతవలన నీకమ్మం గొని చదువుకొని సమరభటుఁడు క్రోధము మీఱ 'అయోగ్యుఁడ వనియే గదా నాయన నిన్ను దేశము వెడల నడిచెను. అట్టిదుర్వినీతునికి నీకీమిథ్యాభిమానము సరియే. తనగవిలో నక్కయు సింగమువోలె పరాక్రమించును, సింగముం గన్నంగదా దానినక్కతనము బయటఁ బడుట.' అని యివ్విధంపు బొబ్బరింత ప్రతిదూత్యముగా కమ్మ వ్రాసి ప్రతి దూతచేత భీమభటునికిం బంపెను. ప్రతిదూతయు బోయి ఆకమ్మను భీమభటుని కందఁజేసెను. అతఁడు దానిం జదివించి విని బొబ్బనవ్వునవ్వి దాయాదుని ప్రతిదూతతో నిట్లనియె:- "ఓరీ, పోయి మామాటగా ఆ నట్టుగుదాని కొడుకుతో పల్కుము.-'మున్ను గుఱ్ఱముకై పోరినప్పుడు శంఖదత్తుఁడు నిన్ను రూపుమాపనుండ, బాలుడ వనియు నాయనకు నీయందు మక్కువ యనియుం దలంచి నేనడ్డపడి కాచితినిగదా, మాటిమాటికి నట్లు నిన్ను క్షమింపను. నిక్కముగా నీమాఱు నిన్ను నీపైప్రేముడిగలవాఁడగు నాయనకడకుం బంపెదను. సిధ్ధముగా నుండుము, దినములలోనే నే నచటికి వచ్చితి నని యెఱుంగుము.' అని.”