1392
కథాసరిత్సాగరము. లం. 12. త. 7.
లాసకుఁ డను నట్టుగుఁడు వచ్చి పూర్వము దైత్యులచేతి యమృతమును హరి స్త్రీరూపమున హరించిన కథను నాటక మాడించెను. అందు వాని కూఁతురు లాస్యవతి యనునది అమృతికావేషమును ధరించెను. రాజు ఆవేషమున వాస్తవమోహినీరూపంబువోలె విశ్వక్షోభితదానవం బయిన యా లాస్యవతి రూపంబుగాంచి, చివురువిలుకాని ములుకులకు గుఱియై, తల్లడిల్లి వర్తకునికి విస్తారము ధన మిచ్చి, కూఁతును లాస్యవతిని తన యంతిపురమున జేర్చుకొని, దానిని వివాహ మాడి, దాని మోమున కన్నులు గ్రుచ్చి కాలము పుచ్చుచుండెను. చిరకాలము పుత్త్రులు కలుగ కుండఁగా నొకప్పుడు రాజు యజుః స్వామినాముని నిజపురోహితుం బిలిచి, తనకై పుత్త్రకామేష్టి చేయు మనెను. అంత నతఁడు విద్వాంసు లయిన బ్రాహ్మణులను రావించి పుత్త్రేష్టి కొన సాగించి, మంత్రపూత మయిన పాయసములో నగ్ర్యభాగమును తనయందు భక్తురా లయిన 'పెద్ద దేవేరి కొసంగి, మిగత ఆ రెండవదానికి లాస్యవతి కిచ్చెను. దాన నాయిరువుర గర్భంబులను మున్ను వాకొన్న శీలధర సత్యధరు లుద్భవించిరి; కాలమున పట్టపుదేవి మనోరమ కల్యాణ లక్షణుని కుమారునిఁ గనియెను. అతఁడు పుట్టిన యాసమయమున నాకసమునుండి 'ఈ శిశువునకు భీమభటుఁ డనిపేరు. ఇతఁడు మహాఖ్యాతితో రాజ్య మేలును.' అని వాక్కు స్పష్టముగా వినఁబడెను. మఱునాఁడు లాస్యవతి కుమారుం గనెను.