Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీదర్శనుని కథ.

1387

శ్లిష్టవాక్కుల నామములు పలికి పూర్వజన్మమును జ్ఞప్తికి తెచ్చెను. అంత నాయంగన లిరువురును మర్త్యదేహము విడిచి యక్షాంగన లయిరి. మేమే ఆయిరువురము. నీవే ఆదీప్తశిఖుఁడవు.” ఇట్లు వారు చెప్పఁగా శ్రీదర్శనుఁడును తనపూర్వజన్మము జ్ఞప్తియై వెంటనే దీప్తశిఖుఁ డై విధికృపచేత మరల ఆ భార్యలతో కూడుకొనెను.

ఓయి విచిత్రకథకుఁడా, నేనే సుమా ఆయక్షుడను దీప్తశిఖుఁడను, ఈయిరువురే ఆనాప్రేయసీమణులు జ్యోతిర్లేఖయు ధూమలేఖయును. దేవాంశజుల మైన మాబోంట్లకు సుఖదుఃఖములు కలుగు చుండ మనుష్యులమాట చెప్ప వలయునా? మీకును త్వరలో మీదొర మృగాంకదత్తునిదర్శనము కలుగును, కావున ఖేదము మానుము. నేను నిచట నీ కాతిథ్యము సేయ నిలిచియున్నాఁడను, ఇది భూలోకములో నానివాసము. ఇట నుండుము. నీకోరికను నేను నెఱవేర్చెదను. అనంతరము నాతావయిన కైలాసమునకుం బోయెదను - ఇట్లు పలికి యక్షుఁడు నన్ను కొన్నిదినము లట నిలుపుకొని యుపచరించు చుండెను. నేఁటిరాత్రి ఆసుమతి మీరిటకువచ్చి యుంట యెఱింగి, మీరెల్ల నిదురగూడి యుండ నిద్రితుని నన్నుం దెచ్చి మీనడుమ పెట్టినాఁడు. మీరు నన్నుఁ గంటిరి, నేనును మిమ్ముం గంటిని. దేవా, ని న్నెడఁబాసిన కాలమున నావృత్తాంత మిది.