Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1386

కథాసరిత్సాగరము. లం. 12. త. 6.

నొండొరులమీఁది యనురక్తిచేత నొక్కట నగ్నిప్రవేశము చేసి, ఆసమయమున వారు 'మాకు ఇట్లే జన్మజన్మమందును భార్యాపతిత్వము కలిగింపుము స్వామీ' యని అగ్నిదేవుని వరమడిగిరి. అంతట కమలగర్భుఁడు తీవ్రతపోమహిమచే యక్ష జాతియందు ప్రదీప్తాక్షునికి పుత్త్రుఁడుగా అట్టహాసునికితమ్ముఁడుగా దీప్తశిఖుఁ డనుపేర జనించెను. అతనిభార్యలు పథ్యాబలలు ధూమకేతుఁ డనుయక్షపతికి కొమార్తెలుగా పుట్టి జ్యోతిర్లేఖా ధూమలేఖా నామములం బరఁగిరి. కాలమున నాకన్నియలు జవ్వనము రాఁగా అరణ్యమున కేఁగి మంచిభర్త కలుగుకొఱుకు హరుఁడు మెచ్చ తపము సల్పిరి. ఆదేవుఁడు మెచ్చి యగపడి ఇరువురకు నిట్లానతిచ్చెను. 'కన్యలారా, మీరు పూర్వజన్మమున ఎవనితోడ భార్యాపతిత్వమును సకలజన్మములకును వేఁడి కలసి చిచ్చుం జొచ్చితిరో, ఆమీపతి యిపుడు అట్టహాసునితమ్ముఁడుగా దీప్తశిఖుఁ డనుపేర యక్షుఁడై పుట్టియున్నాఁడు. వాఁ డిపుడు దొరశాపముచేత మనుష్యజాతిలో శ్రీదర్శనుఁడనుపేరఁ బుట్టియున్నాఁడు. కావున మీరును మర్త్యలోకమున జన్మించి యతని కచట భార్య లగుఁడు. శాపాంతమున నెల్లరును మరల యక్షుల రయ్యెదరు.' ఇట్లు గౌరీపతి యానతీయ నారువురు యక్షకన్యలును పద్మిష్ఠానంగమంజరులుగా భూలోకమున జన్మించి శ్రీదర్శనునికి భార్య లయిరి. అట్లుండ నట్టహాసుఁడు బ్రాహ్మణరూపమున వారికడకు వచ్చి యుక్తిగా