1376
కథాసరిత్సాగరము. లం. 12. త. 6.
నీవు గైకొమ్ము. వీనిని తలకు కట్టుకొని చేత నుంచుకొన్న మాత్రాన రాజు యక్ష్మరోగము శాంతించి సేమ మొందును. నీవును త్వరలో సర్వభూమికి ఏలిక వగుదువు.' అని వక్కాణించెను. ఆమాటకు శ్రీ దర్శనుఁ డిట్లనియె;- 'సాధకుఁడు లేక నే నొంటిగా రాజుకడ కెట్లు పోదును ? స్వార్థపరత్వముచేత నీతఁడు, సాధకునిం జంపివేసినాఁడు. అనిగదా రాజు పలుకును ' శ్రీ దర్శనుఁ డిట్లనఁగా బేతాళుఁడు, 'నీకు నేను తార్కాణ చెప్పెద, దాన నీమీఁది దోషము దొలంగును. నేను మ్రింగిన యీ సాధకుని ఈశవము కడుపు చింపి రాజాదులకు చూపుదువు గాక.' అని పలికి ఆవా లిచ్చి శవమును వదలి యెటకో పోయెను. అంత నాశవము నేలం గూలెను. అంతట శ్రీదర్శనుఁడు ఆయావాలు గొని తనవారున్న యామఠమున నారాత్రి శేషముం గడపి తెల్ల వాఱఁగానే రాజు సన్నిధికిం బోయి రాత్రి వృత్తాంతమంతయు నివేదించి మంత్రులను వెంటం దెచ్చి పీనుఁగు కడుపు చీల్చి అందలి యాసాధకుని మృతుని వారికిఁ జూపెను. అనంతరము రాజునకు తలను చేతను ఆయావాలు కట్టెను. దాన రాజు సకలవ్యాధియుం దీఱి హాయిం బొందెను. అంతట ప్రాణదాతయైన శ్రీదర్శనుపై శ్రీసేనమహారాజు కరము తుష్టుఁడై సంతతిలేనివాఁ డగుటచే నతనిని పుత్త్రునిగాఁ గైకొని అప్పుడే యతనికి యౌవరాజ్య పట్టాభిషేకము చేసెను. సుక్షేత్రమందు చల్లిన సుకృతబీజము మహాఫల మొసంగును.