Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1362

కథాసరిత్సాగరము. లం. 12. త. 6.

పాటుపడినను ఫలముం బొంద నేరరు. వారికి దైవము అంత ప్రతికూలముగా నుండును.'

ఇట్లతఁడు చింతింప నసురకన్యాపానముచే తడిసిన యతనిమేని నేత్తావికై తేంట్లు వచ్చి ముసరుకొన్నవి. 'అయ్యో! సత్త్వహీనునికి బేతాళోత్థాపనమువోలె నాశ్రమ నాకు ఇష్టసిద్ధికి బదులుగా చేటు దెచ్చినది.' అని వగచుచు నతఁడు ఆతేంట్లు కుట్టను కుట్టను సహింపఁ జాలక ప్రాణత్యాగమునకు నిశ్చయించుకొనెను. అంతలో నాదారిని దైవికంబున నొక మునికుమారుఁడు ఆ దుర్దశలో నున్న యారాజును గని చెంత కేఁగి కనికరముచే నాతేంట్లను తోలి వృత్తాంత మడిగి తెలిసికొని రాజుతో నిట్లనియె. 'రాజా, ఎంతవట్టు దేహ ముండునో అంతవట్టు దుఃఖము క్షయించుట యెక్కడిది ? కావున కలఁతఁజెందక బుద్ధిమంతులు పురుషార్థమును సాధింపవలసినది. ఎంతవఱకు బ్రహ్మవిష్ణ్వీశానులయందు ఏకత్వబుద్ధి యుండదో అంతవఱకును భేదోపాసనలవలనఁ గలిగినసిద్ధులు అశాశ్వతములే. కావున అభేదబుద్ధితో బ్రహ్మవిష్ణుమహేశ్వరులను ధ్యానించుచు ధైర్యముతో మరల పండ్రెండు సంవత్సరములు ఇచ్చట తపస్సు చేయుము. అందున ఆ కాంతం బొందుదువు. తుదను శాశ్వతమయినసిద్ధిని బడసెదవు. దివ్యసౌరభము గల దేహము ఇప్పుడే నీకు సిద్ధించి యున్నది. ఈకృష్ణాజినమును మంత్రములతోఁ గూడం గయికొమ్ము. దీనిని కప్పుకొందునేని నిన్ను తేం ట్లే