Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూనందనుని కథ.

1359

అవి పిడుగు తగిలినవియుంబోలె నెటకో దూరము పలాయితము లయినవి, అంత నందఱును ఆద్వారమునం బ్రవేశించి లోనికేఁగి కనకరత్నమయము లయిన మందిరములం గాంచిరి. ఒక్కొక్కదానిద్వారమునను ఔడు గఱచుచు భయంకరులు ద్వారపాలకులు ఇనుపరోకండ్లం గేలగొని నిలుచుచుండిరి. అంతట ముని దుష్టఘ్ని యనుయోగధారణం గావించెను. ఆ ధారణ ప్రభావంబున నాద్వారరక్షకు లెల్ల పలాయితు లై కానరాకపోయిరి. అంత క్షణములో నాద్వారములనుండి దివ్యాలంకార వస్త్రలు దైత్యకన్యల యూడిగంపు వెలయాండ్రు వెలువడి ఒక్కొక్కనికడకు వచ్చి మునివఱకు ఎల్లవారిని తమతమయేలికసానిమాటగా లోపలికి రమ్మని పిలిచికొని పోయిరి. 'మీరు లోనికి పోయిన తర్వాత మీమీ ప్రేయసిమాటను మీరు దాఁటఁ గూడదు' అని ముని యితరులను మూదలించి తానును ఒకకొందఱు వారాంగనలతో నొకదివ్యభవనము ప్రవేశించి అందు ఒకదైత్యకన్యామణిని మహాభోగములను బడసెను. ఇతరులు నట్లే ఒక్కొక్కఁడు నితర వారవిలాసినులతో ఒక్కొక్క మందిరములోనికిం బోయి యట దైత్యకన్యాసంభోగపాత్రము లయిరి. భూనందనభూపాలుని ఒకతె వినయమునం బ్రణమిల్లి యొకమణిమయగృహమునకుం గొనిపోయెను. ఆమందిరము ఊడిగంపుఁజెలువల ప్రతిబింబములచేత రత్నకుడ్యములయందెల్ల జీవముతోడీ చిత్తరుబొమ్మలు గలదియుం బోలెనుండెను