Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1344

కథాసరిత్సాగరము. లం. 12. త. 5

ఆశ్రమము మరు వగుటం గాంచినవారై యపుడె దృఢసమాధి నుండి వ్యుత్థానాభిముఖుఁ డైన సోమశూరునితో ఆవృత్తాంతమును నివేదించిరి. అతఁడు యోగదృష్టిచేత గురువృత్తాంతము నెఱింగి గురుభార్యలకు దుఃఖకరమయినను ఆచేష్టితమును వివరించి, అనంతర మాయిరువురతోను ఆగోతికడకుఁ బోయెను. అచట పతివ్రతలు ఆ నాగసుతా రాజసుతలు కొమ్ములు నెమ్ములును మిగిలిన మృగాకారమున నున్న పతిం గని శోకించి యా కొమ్ముల నెమ్ములను తెచ్చి తమయాశ్రమమునుండి కొయ్యలు తెచ్చి పేర్చి అగ్నిప్రవేశము చేసిరి. అంత నావృత్తాంత మెల్లను విని దుఃఖితుఁ డై యనుచరులతోఁ గూడ కనకకలశుఁడును అగ్నిప్రవేశము చేసెను. సోమశూరుఁడును గురుమరణమును సహింపఁజాలక దర్భాసనమందు ప్రాయోపవేశము చేసెను. అంత నాక్షణమందు ఇంద్రుఁడు అతనికడకు వచ్చి ప్రత్యక్ష మై 'సోమశూరుఁడా, ఇట్లు చేయకు, నేను నీగురువును పరీక్షించితిని. ఆస్థిభస్మావశిష్టుఁడైన యాతని సభార్యుని సారథిని నే నమృతముం గురిసి బ్రతికించితిని.' అని బోధించెను. ఇంద్రుని యీమాట విని సోమశూరుఁడు సంతసిల్లి అతనికిం బ్రణమిల్లి లేచి పోయి చూచునంతటికి బోధిసత్త్వుఁడు- వినీతమతియు భార్యలును అతిథులును అందఱును బ్రదికియుండిరి. అంత నతఁడు పరలోకమునుండి భార్యలతోఁగూడఁ మరల వచ్చినవాఁడైన గురువు పాదములకు తన శిరము సోఁకం బ్రణమిల్లి, వాక్పుష్పములం