Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1336

కథాసరిత్సాగరము. లం. 12. త. 5

యాచిత్రపటమున తన ప్రభావముచేత సజీవ మయిన యొక పామును వ్రాసి, తాను అగపడక యుండెను. ఇంతలో మలయమాలి పూవులు కోసితెచ్చి పటములో పామును గని 'ఇదేమి ? ఎక్కడిది ఈపాము ? దీనిని రూపనిధాన మయిన యీసుందరీమణిని కాపాడుటకై బ్రహ్మ నిర్మించినాఁడు గావలయు.' అని తలంచి పూవులతో పటమందలి ప్రియను అలంకరించి కవుంగిటం బొదువునంతట మునిమహిమచే నామె ఆపాము కఱచి మృతిఁ జెందినది గా నతనికిం దోఁచెను. అంతట మలయమాలి చిత్రపటమును మఱచి హాహాకార మొనర్చి మూర్ఛిల్లి పట సంసిద్ధవిద్యాధరుఁడు వోలె నేలంగూలెను. క్షణములో మరల తెలివి గలిగి ఏడ్చుచు ప్రాణత్యాగము సేయ నిశ్చయించుకొని యొకచెట్టుతుద కెక్కి యటనుండి క్రిందికిఁ బడెను. అంతట ముని బయలువడి యతనిని నేలఁబడనీయక యంతరాళమంద తనచేతులతోఁ బట్టుకొని నిలిపి యోదార్చి యిట్లనియె:- ఓయి మూఢుఁడా, నీవు వలచిన యా రాజకుమారి తనమందిరమున స్వస్థముగా నుండుట నెఱుంగవా? ఇది చిత్తరువులో నిర్జీవప్రతిమ. నీ వెవతెను గవుంగలించు కొనుచున్నావు ? ఎవతెను పాము కఱచినది ? ఇది యెల్ల రాగాంధుఁడ వయిన నీభావనవలని భ్రమ కాదా. ఇట్టి దృఢధ్యానముతో తత్త్వజ్ఞాన మేల సాధింపరాదు? మఱి యిట్టిదుఃఖము లెన్నఁడును కలుగవు గదా.' ఇట్లు ముని వలుకఁగా మలయమాలి అజ్ఞాన మను రాత్రి