ధ్యానపారమిత.
1335
నామిత్త్రుఁడు 'వణిక్కుమారునికి నీకు రాజకన్యపై యీవలపు తగదు. హంస యితరసరస్సుల తామరలందు సుఖంబుండఁ గోర నగును గాని శ్రీహరినాభికమలభోగము నభిలషింపం దగునా?' అని యతని నానావిధముల భోధించియు మరల్ప వలంతి గాక, యతనికి ఉత్కంఠావినోదనార్థము ఆరాజకన్యకను పటంబున వ్రాసి యిచ్చెను. అంతట మలయమాలి యాచిత్తరువునే వాస్తవ మయిన యిందుయశనుగా భావించి, దానిని చూచుచు బతిమాలుచు తాఁకుచు అలంకరించుచు, క్రమముగా తన్మయత్వము పొంది, ఆవాస్తవభావనచేతనే సకలక్రియలు జరుపుకొనుచు నుండెను. భావనాబలముచేత క్రమముగా నాచిత్తరువు తనతో సరససల్లాపము లాడునట్లును, తన్ను ముద్దులు గొనుచున్నట్లును తలంచి, భావనాసిద్ధ మైన కాంతాసంభోగమున తృప్తుఁడై, చిత్రపటమాత్రముననే సకలసంసార వ్యాపారములను నెఱవేర్చు కొనుచుండెను. ఒకనాఁడు రాత్రి నెల పొడువఁగా ఆచిత్రపటమును కైకొని ప్రియతోఁ గలసి విహరించుటకై యుద్యానవనమునకుం బోయెను. అట నొక మ్రాని మొదట నాచిత్రపటము నుంచి తాను ప్రియకై పువ్వులు దేర కొంత ద వ్వేఁగెను.
ఆ సమయమునందు వినయజ్యోతి యనుమహాముని యొకఁడు ఆకాశమార్గమునం బోవుచు నతనిం, గని, కనికరించి, యజ్ఞానమునుండి యుద్ధరింప నుద్యుక్తుఁడై, క్రిందికి దిగి వచ్చి,