Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినీతమతి బోధిసత్త్వచర్య

1323

వినీతమతి భూపతి తనమంత్రులతో నిట్లనియె: — 'అయ్యో! పాపము ! ఈసాధువు నాతప్పున నీదశకు వచ్చినాఁడు. కాన నారాజ్య మితని కిచ్చి యీతప్పు దిద్దుకొనియెదను. ఒరుల కుపయోగపడని యీ రాజ్యము నా కేల? సంతతి లేనినాకు ఇతఁడే పుత్త్రుఁ డై రాజ్యభారము వహించును గాక' ఇట్లు పలికి, వారు ఒప్పకున్నను అతనిని రప్పించి, యతనికి నిజరాజ్య మిచ్చి నిర్వికల్ప చిత్తముతో తత్క్షణమే భార్యలం దోడ్కొని నగరము వెలువడెను. 'అయ్యయో, అమృతకరుఁడు సంపూర్ణుఁ డై లోకము నానందింపం దొడంగెనో లేదో, అకాండ మేఘము వచ్చి మఱుఁగుపఱిచివేసినది! ప్రజాకల్పవృక్ష మీరాజు సకలప్రాణులకును సకలాశాపూరణము సేయందొడంగెనో లేదో విధి యితని నెటకో కొనిపోయెను.' ఇట్లు పలువగల వందురుచు పురజనులు ఇండ్లు విడిచి అతనిదే లోక మని వెంబడించిరి. ఎట్టకేలకు వారిని మరల్చి పట్టు వదలక వినీతమతి మహారాజు కాలినడకనే భార్యలతోఁగూడ కాన కేఁగెను. పోయి పోయి నీళ్లు చెట్లును లేక ఎండకు కాలినయిసుకయెడారిని ఇతని ధైర్యమును పరిశోధింప విధి సృజించినదానిని చేరెను. అందొకచోట దప్పిగొని దూరపుంబయనముచే నలసి కూర్చుండు నంతట భార్యలకును నతనికిని నిద్ర పట్టెను. అతఁడు మేలుకాంచి చూచునంతటికి తన సత్త్వోత్కర్షచే నుప్పతిల్లిన గొప్ప యుద్యానవన మొకటి కాన వచ్చెను. అందు విరిదామరలు చల్లని