1298
కథాసరిత్సాగరము. లం. 12. త. 4
కలిపినపిండితో, బూడిదపిడికిటి పోటుముట్టువాఁడు మూఁడుకాళ్లవాఁడు ముమ్మోముల వాఁడునుంగా జ్వరపురుషుని చేసి పెట్టి, రేకులలో అతని పరివారమును యథావిధిగా నమర్చి, జ్వరపురుషుని నిజమంత్రమున నావాహన చేసెను. అనంతరము కనకమంజరి మునుపటివలె అతనికి స్నానార్ఘ్యాది పూజాంగము లొనరించి నరబలి వేయునది యై యశోకకరితో 'చెలీ, నేలకు ఎనిమిది యవయవములును సోఁకునట్లు దేవునికిం బ్రణమిల్లుము, అట్లు చేసిన నీకు మే లగును.' అని చెప్పెను. వల్లె యని యది నేల దండప్రణామంబు గావింప నాద్రోహిణి కనకమంజరి దానిని కత్తితో వేసెను. దైవయోగమున దెబ్బ యసిఁబోయి బుజమునకుమాత్రము ఇంచుకంత తగులఁగా నశోకకరి అడలి లేచి పలాయిత యాయెను. కనకమంజరి తఱుముకొని వచ్చుటను గని యశోకకరి కుయ్యో మొఱ్ఱో యని మాటిమాటికి నేడ్చుచుం బరుగెత్తెను. అంతట నారెకులు విని యటకు వడిగాఁ బఱతెంచి వచ్చిరి. కత్తిదూసికొని తఱుముకొని వచ్చిన ఘోరమూర్తిని కనకమంజరిని గని రక్కసి యని యాయుధములతోఁ గొట్టి గుడుగుడుజీవముదానిం గావించిరి. అనంతరము అశోకకరివలన వాస్తవవృత్తాంతము నెల్ల నెఱింగి, వారి నిరువురను కొత్వాలు కూడ రా రాజుకడకుం గొనిపోయి వృత్తాంతమును నివేదించిరి.