Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1284

కథాసరిత్సాగరము. లం. 12. త. 4

వరుసను నాతో 'ఱేపు పూర్వాహ్ణంబున రాజునోలగంబునందు తత్పుత్త్రిక హంసావళి క్రొత్తగా నేర్చినవృత్తమును ప్రదర్శించును.' అని చెప్పెను. అంతట నేను కుతూహలము వొడమి యతనిని వేఁడగా, నతఁడు మఱునాఁడు ఉపాయముచేసి నన్నుఁగొనిపోయి యారంగమండపమునం గూర్చుండఁబెట్టెను. అట వాద్యములు మ్రోఁగఁగానే యాతలోదరి హంసావళి రంగముసొచ్చి తండ్రి మ్రోల నర్తన మారంభించెను. అల్లలనాడు పూఁదొడవులతోను కదలికలం బొదలు కైచివుళ్లతోను రాజకన్యక ప్రాయంపుఁ దెమ్మరకు ఊఁగిసలాడు వలరాచవల్లియో యన విరాజిల్లుచుండెను. అంతట నేను 'ఈహరిణాక్షికి కమలాకరకుమారుఁడు దప్ప తగినభర్త వే ఱొకఁడు లేఁడు. అట్టి యాతనితో నిట్టి యీమెను గూర్పఁడేని వలరాజు పూలవింటి నెక్కువెట్టుట కేవల దురాగ్రహంబ యగును. కాన అందుకై నేను తగినయుపాయ మొనర్చెదం గాక.' యని తలపోసి యాట ముగియఁ గానే రాజద్వారమునం జేరి 'నాతో సరిగా ఎవఁడేని చిత్రకరుఁడు చిత్తరువు వ్రాయఁగలఁడేని వ్రాయుఁగాక.' అని యొక వస్త్రఖండమున వ్రాసి దాని నట వ్రేలఁగట్టితిని. దాని నొరు లెవ్వరును చింపరైరి.

అది విని రాజు నన్ను తనకొమరితయింట చిత్తరువులు వ్రాయ నియోగించెను. నేను హంసావళిపడుకటింట సపరివారుని నిన్ను వ్రాసితిని. 'ఈమెతో స్పష్టముగా చెప్పుదునేని ఈమె