1282
కథాసరిత్సాగరము. లం. 12. త. 4
దని యెంచి దానిని విప్పివేసెను. తత్క్షణమే యానెమలి యతని మంత్రి భీమపరాక్రముఁడై అత్యుత్సుకతతో నతని యడుగులకు మ్రొక్కెను. మృగాంకదత్తుఁడు ఆశ్చర్యపడి యతనిని కవుంగిలించి, 'మిత్త్రమా, ఏమి యిది? వివరింపుము.' అని యడుగఁగా, సంతసంబున భీమపరాక్రముఁ డిట్లు చెప్పసాగెను.
భీమపరాక్రముని కథ.
దేవా, నావృత్తాంతము నామూలముగా వచించెద వినుము. అపుడు నేను నాగశాపముచే నిన్నెడఁబాసి చెదరిపోయి యడవిలో ద్రిమ్మరుచు నొకబూరుగుఁజెట్టును సమీపించితిని. దాన గణేశప్రతిమ యొకటి చెక్కఁబడి యుండెను. నేను దానిం గని నమస్కరించి బడలికచే చెట్టుక్రిందం గూర్చు౦టిని. 'అయ్యో! ఈచెట్ట యెల్ల పాపాత్ముఁడ నైన నావలనం గలిగినది, నే నేల యపుడు ఏలికకు రాత్రిబేతాళవృత్తాంతమును నివేదించితిని ! కావున దోషిని నే నిటనే మృతిం జెందెద?' అని నిశ్చయించుకొని, నేను ఆదేవునిసన్నిధిని నిరాహారుండ నై యుంటిని. ఒక కొన్నిదినము లయినంత నా దారిని ముదుసలి తెరువరి యొకఁడు వచ్చి ఆచెట్టునీడనే కూర్చుండెను. అతఁడు నన్నుఁ గని 'వత్సా, నీవు ఇట్లు మోము వాడి యేల యీ నిర్మానుష్యప్రదేశమున నున్నాఁడవు ?' అని సస్నేహముగా నడుగఁగా నావృత్తాంత మంతయుందెల్పితిని. అంత నతఁడు నాకు ధైర్యము చెప్పుచు నిట్లనియె:- వత్సా, వీరుఁడ వయ్యును