Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చండకేతుని కథ.

1279

డెను. దారిలో చీఁకటి వసమున నెవనిదో మఱియొక పురుషుని బుజము ఇతని బుజమునకుం దగిలెను. ఆ త్రోపునకుం గినిసి మృగాంకదత్తుఁడు వానిని తనతోఁ బోరాటమునకు రమ్మనెను. ఆపురుషుఁడు ప్రోడ సమయోచితముగా నిట్లు మూదలించెను. 'ఏమి ! ఆలోచింపకయే కోపించెదవు. కొంచె మాలోచింతువేని ఈతప్పు ఈరాత్రిని ఇంకను వెలింగింప కున్న చంద్రునిది; కాదేని, చంద్రునికి రే యెల్ల వెలుంగ నధికారము నొసంగని బ్రహ్మదేవునిది. వారివలనం గదా ఇట్టి చీఁకటిలో నిష్కారణముగా వైరము లిట్లుప్పతిల్లును.' మృగాంకదత్తుఁడు విని 'ఔను, నీచెప్పినది సరియే.' యని యొప్పుకొని యతని నాగరకభాషణమునకు సంతుష్టుఁడై అతనిని నీ వెవ్వఁడ వని యడిగెను. దొంగనని యతఁడు పలుకఁగా, మృగాంకదత్తుఁడు 'అట్లేని నీ చేయి దెమ్ము, నాకు నీవు సబ్రహ్మచారివి.' అని అతనితో చెలికారము గావించి, జిజ్ఞాసచే నతనితోఁగూడనే పోవుచుండెను.

ఇరువురును గడ్డి మూసికొన్న యొకపాడునూతికి వచ్చిరి. అందుదిగి సొరంగముదారిని ఆ పురుషునివెంబడి పోయి మృగాంకదత్తుఁడు మాయావటువు నంతఃపురము చేరెను. ఆట మృగాంకదత్తుఁడు దీపపు వెలుగునం జూడఁగా ఆపురుషుఁడు ప్రతీహారి చండకేతువుగాని దొంగ కాఁ డాయెను. రాజభార్యాప్రచ్ఛన్నకాముకుఁ డా ప్రతీహారి వెలుతురు చాలనిమూల మాఱువేషమున నడంగియున్న మృగాంకదత్తుని ఆనవాలుపట్టఁ డాయెను.