Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాయావటువుతో చెలిమి.

1277

కడకు వచ్చినాఁడు!' అను సంతోషమున నృత్యములు సేయుచు నవ్వుచు నున్నదో యన నింపారుచు చపలాశయయై యుండెను. అం దతఁడు స్నానమునకు దిగఁగా నచటికి మాయావటు వను పేరి బోయరాజును స్నానమునకు వచ్చెను. బోయను స్నానము చేయుచుండఁగా తటాలున మువ్వురు నీటిమానుసులు ఒక్కటం బట్టుకొనిరి. అతని పరిజనులు కని వెఱచి పలాయితు లైరి. అంత మృగాంకదత్తుఁడు అనీటి మనుష్యులను కత్తితో నఱికి బోయను కాచెను. నీటినుండి మృత్యువునుండియు వెడలి బోయరాజు మృగాంకదత్తునిపాదముల వ్రాలి 'మహాత్మా', ఎవరవు నీవు? నిన్ను బ్రహ్మ నాప్రాణములు గావ నిటకు తెచ్చినాఁడు. ఏవంశమునకు నీ వలంకార మవు ? నీ వెటకు పోవుచున్నావో పుణ్యములచే కటాక్షితమైన యాదేశ మేది?' అని యడిగి, శ్రుతధివలన వృత్తాంతమెల్ల నెఱిఁగి, వెండియు మృగాంకదత్తుని పాదములకుం బ్రణమిల్లి 'అట్లేని నీవుగోరిన యీ కార్యమందు నన్నును నాచెలికాని మాతంగపతిని దుర్గపిశాచనామునిం గూడ సహాయులనుగా ననుగ్రహింపవలయును.' అని వేఁడుకొనెను. మృగాంకదత్తుఁ డంగీకరించెను. అంతట మాయా వటువు మృగాంకదత్తుని భక్తి పూర్వకముగా తన పల్లెకుఁ గొనిపోయి తన శక్తికొలఁది రాజోపచారములు సేసి పూజించెను. పల్లీజనులెల్ల నట్లే మృగాంకదత్తునిం బూజించిరి. ఆ మాతంగరాజు కూడ వచ్చి మిత్త్రప్రాణదాత యని మృగాంక