Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1270

కథాసరిత్సాగరము. లం. 12. త. 3

కోపావేశము తగ్గి యతని సహాయులను మృగాంకదత్తాదులను 'మీరు నిష్కారణముగా వీనితోఁజేరి యిట్లు చేసితిరి గాన కొంతకాలము ఒండొరుల నెడఁబాయుదురు.' అని శపించి యదృశ్యుఁడాయెను. తత్క్షణమే శాపప్రభావముచేత కన్నులు చీఁకట్లు కొని చెవులు చెవుడ్పడి మృగాంకదత్తాదులు ఒండొరువులం జీరుచు వెదకుచు ఎటకెటకో పోయి నిలిచిరి. అంతట మృగాంకదత్తుఁడు రాత్రిమాయ ముగియఁగా మంత్రులంబాసి యొంటిగా అడవిలో నిటు నటుం గ్రుమ్మరు చుండెను.

ఇవ్విధమున రెండుమూఁడునెలలు కడచిన తర్వాత ఆకస్మికముగా శ్రుతధి వెదకికొనివచ్చి మృగాంకదత్తుని కలసికొనెను. అట్లు వచ్చి హర్షంపుఁ గన్నీళ్లతోఁ బ్రణమిల్లిన యాశ్రుతధిని గౌరవించి మృగాంకదత్తుఁడు మంత్రులవార్త యే మని అడుగఁగా, 'వారిని నేను గనలేదు, కాని వా రందఱు ఉజ్జయినికిం బోవుదు రని తలంచెదను, అది గదా మీరందఱుం బోవలసినచోటు' అని శ్రుతధి యూఱడించి ప్రేరేపించెను. అంత నతనిం గూడి మృగాంకదత్తుఁడు క్రమముగా నుజ్జయినికి పయనము సాగించెను. కొలఁది దినములు నడచినంతట దారిలో నొకనాఁడు ఆకస్మికముగా విమలబుద్ధి వచ్చి కలసి కొని మృగాంకదత్తుని ఆనందబాష్పపూర్ణలోచనుఁ డై ప్రణమిల్లెను. అతఁడును సంతసించి ఆ నిజమంత్రిని గవుంగిలించి కూర్చుండ నియమించి