1036
కథాసరిత్సాగరము. లం. 10. త. 2.
హస్తిశతము ఇరువదివేల గుఱ్ఱములు పూర్ణరత్న మయిన యీ మందిరమును సర్వమును తమదే.' ఇట్లు పలికి కుముదిక మహార్హము లయిన స్నానాద్యుపచారములతో సమంత్రిని రాజును ఉపచరించెను. విక్రమసింహరాజు ఖిన్నుఁ డయ్యును కుముదిక చేయుచున్న యుపచారములు గ్రహించుచు సామాత్యుఁ డై అట నుండెను. దాని ధనమును రాజు స్వేచ్ఛగా వ్యయముచేసెను; యాచకుల కిచ్చెను. కుముదిక అందులకు వికృతి పొందక సంతసించుచునే యుండెను. 'అహో! దీనికి నా యందు ఎంత ప్రేమ!' అని సంతోషించుచున్న రాజును చెంత నున్న మంత్రి ఏకాంతమున నిట్లనియె.
'దేవా, వేశ్యలకు సద్భావము లేదు. ఈ కుముదిక నీయందు చూపెడు భక్తికి కారణము తెలియకున్నాను!' 'ఇట్లు కాదు, కుముదిక నాకై ప్రాణములను కూడ ఇచ్చును, నీకు నమ్మకము లేదేని నిదర్శనము చూపెదను.' అని పలికి రాజు ఈకపటమును పన్నెను. ఆహారపానాదికములు తగ్గించి తనదేహమును క్రమక్రమముగా కృశము చేసి అవయవములు శిథిలము లగునట్లును చేసికొని, చచ్చినట్లును పడి యుండెను. పరిజనులు అతనిని శిబికలో పెట్టి శ్మశానమునకుఁ గొనిపోయిరి. అనంతగుణుఁడు శోకమును అభినయించుచు కూడఁ బోయెను. కుముదికయు శోకాకుల యై బంధువులు ఎంత వారించినను నిలువక తానును వచ్చి ఱేనిచిత యెక్కెను. నిప్పు పెట్టఁ