Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1256

కథాసరిత్సాగరము. లం. 12. త. 2

యాసురభిమారుతాశ్రమము, నిశ్చయముగా నన్ను చండికాదేవి సముద్రము దాఁటించినది. ఈ చెలువ నా పూర్వభార్య యని ముని పల్కెనుగదా, ఇది చిత్రముగా నున్నది.' అని తలపోసి సంతసము వెల్లి విరియ మునిని 'స్వామీ, ఈ కన్య నాపూర్వభార్య యంటిరి, అది యెట్లో దయచేసి చెప్పుదురు గాక,' యని వేడుకొనెను. ముని కౌతుకమేని విను మని యిట్లు వచింప సాగెను.

(విద్యుల్లేఖా ధర్మసేనుల కథ.)

తామ్రలిప్తియందు విద్యుల్లేఖయు ధర్మసేనుఁడు నని వణిగ్దంపతు లుండిరి. ధర్మసేనుఁడు తన్ను దొంగలు కొట్టి దోఁచుకొనఁగా సభార్యఁడై యగ్నిప్రవేశార్థము వెడలెను. ఆ కాలమున నాకాశమార్గమున నేతెంచిన యందంపు హంసదంపతులను వా రిరువురుం గాంచిరి. ఆహంసలనే తలపోయుచు వారు చిచ్చుం జొచ్చి, పిమ్మటిపుట్టువున హంసియు హంసంబునై, భార్యాపతులుగానే కూడిరి. ఒకానొకప్పుడు ఆయంచలు వర్షాకాలములో ఖర్జూరవృక్షముమీఁద గూఁట నివసించు చుండఁగా తుపాను వచ్చి చెట్టు పడిపోయి వానికి వియోగము కలిగెను. గాలి నిలిచిన తర్వాత హంసము హంసిని నీళ్లలోను చెఱువు లందును వెదకి కానక, హంసలకు వర్షాకాలసేవ్యమైన మానస సరస్సునకు పోవుచున్న యొకహంసిని దూరమునుండి కని, తనభార్య యని యాస గొని, స్మరాతురమై, వెంటఁ జని, మానసము