కుముదిక యనువేశ్య కథ.
1035
విఱిగి పోయెను. ఆసమయమందు అనంతగుణుఁ డను నామంత్రి విక్రమసింహుని చెంతకు వచ్చి 'మనబల మెల్ల పగిలి పోయినది, మనకు జయము లేదు. నామాట వినక బలవంతులతో పోరు పెట్టుకొంటివి. ఇప్పటి కైన నామాట విని మేలు పొందుము. ఏనుఁగును దిగి గుఱ్ఱ మెక్కి పరదేశమునకు పోదము రమ్ము. బ్రదికియుండిన వీరిని మరల జయింప వచ్చును.' అని పలికెను. ఆతని మాట విని రాజు ఏనుఁగును దిగి గుఱ్ఱమెక్కి అతనితోఁ గూడ తన బలమునుండి బయలు వెడలెను. మాఱువేషము వేసికొని ఆమంత్రితోఁ గూడ విక్రమసింహుఁడు క్రమముగా ఉజ్జయినికిఁ బోయి అచట మహాధనసమృద్ధ మయిన కుముదిక యను వేశ్యాంగన యింటికి మంత్రిద్వితీయుఁ డై చనియెను.
ఆకస్మికముగా వచ్చిన యతనిని చూచి ఆవేశ్య యిట్లు చింతించెను. - 'ఇతఁ డెవఁడో మహాపురుషుఁడు; తేజముచేతను ఇతఁడు రా జని తెలియుచున్నది. ఇతనిని స్వీకరింతునేని నా యభీష్టము సిద్ధించును!' ఇట్లాలోచించి కుముదిక సమంత్రిని రాజును కుశల మడిగి గొప్పగా ఆతిథ్యము చేసి, విశ్రాంతుఁడైన పిమ్మట రాజుతో నిట్లనియె. - 'నేను ఇప్పుడు ధన్యురాల నయితిని. నా పూర్వ సుకృతము ఇప్పటికి ఫలించినది. ఏలినవారు వచ్చి మా యింటిని పవిత్రము చేసినారు ; కావున ఈ ప్రసాదముచే కొనఁబడిన దాసిని నేను. నా దయిన యీ