1250
కథాసరిత్సాగరము. లం. 12. త. 2
సేపు ధ్యానముచేసినట్లు అభినయించినవాఁడై రాత్రి యాతని భార్యను ఆపురుషులు ఎటకుఁ గొనిపోయిరో ఆప్రదేశమును గుర్తులతోఁ గూడ స్పష్టముగా చెప్పెను, హస్తిపాలకుఁడు మంత్రికి ప్రణతుఁడై నెల వొంది తత్క్షణమే నగరరక్షకులను వెంటం గొనిపోయి, మహావ్రత్యుక్త మయిన యాగృహమును చుట్టవేసి, తనభార్యను హరించిన యాపురుషులను సంహరించి, ధనముతోఁ గూడ తనభార్యను మరలం బొంది యిల్లు సేరెను.
మఱునాఁడు ఉదయకాలమున నతఁడు వచ్చి భక్తిపూర్వకముగా దండ ప్రణామ మొనర్చి యా మాయవ్రతిని తనయింటికి భోజనమునకు రమ్మని వేఁడుకొనెను. వ్రతియు 'మేము గృహములం బ్రవేశింపము, రాత్రియే భుజింతుము గాని పగటివేళ భుజింపము.' అని పల్కఁగా, హస్తిపాలుఁడు అట్లే అతనికి రాత్రి యేనుఁగుల తబేలాలో భోజనమున కేర్పాటు గావించెను. మంత్రి మంత్రబలముచేత నొకవెదురుగొట్టములో పాము నొకదానిని పెట్టుకొని యుండి ఆగొట్టమును గూడ కొనిపోయి అనుచరసమేతుఁడై భోజనము కావించెను. తమ్ము వీడ్కొని హస్తిపాలుఁడు పోయి నిద్రించిన పిమ్మట, ఇతరులు అందఱును నిద్రించు చుండఁగా, మంత్రి వెదురుగొట్టముతో ఆ పామును నిద్రితమై యున్న యాభద్రదంతగజము చెవిలో చొరఁబెట్టి, యారాత్రిని తబేలాలోనే గడపి, మఱునాఁడు తన దేశమునకుం దరలిపోయెను. ఏనుఁగు మృతినొందెను. ఈరీతిని