Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1242

కథాసరిత్సాగరము. లం. 12. త. 1

మడిగెను. ఆమెయు తనిసి యతనికి సభార్యునికి కాలసంకర్షిణీ విద్యను దీక్షాపూర్వకముగా నుపదేశించెను. అతఁడును సభార్యుఁడై శ్రీపర్వతమునకుం బోయి యచట నావిద్యను సాధించెను. విద్య సిద్ధించి ప్రత్యక్షమై యతనికి ఉత్తమ మగు ఖడ్గమిచ్చెను. క త్తింగొని యతఁడు భార్యతోఁగూడనప్పుడే విద్యాధరోత్తముఁ డై తనసిద్ధిప్రభావముచే మలయపర్వత శృంగమందు రజతకూట మను పేర నగర మొకటి నిర్మించి అందు విద్యాధర రాజ్యము నేలుచుండెను. కాలక్రమమున నా దంపతులకు లలితలోచన యను పేర కన్య యొకతె జనించెను. 'ఈకన్య విద్యాధర చక్రవర్తికి భార్యకాఁగలదు.' అని యామె జన్మసమయమున నాకాశవాణి పలికెను. ఆర్యపుత్త్రా, నేనే ఆకన్యను, నావిద్యాప్రభావముచే నిన్నెఱింగి వలచి యిచటికి ఈమలయ సానువునకుం గొని వచ్చితిని.

ఇట్లు నరవాహనదత్తుఁడు ఆమెవలననే ఆమెను విద్యాధరినిగా నెఱింగి గౌరవము సూపి యామెతోనే అచట నుండెను. వత్సరాజాదు లతనివృత్తాంతమును రత్నప్రభాదుల విద్యామహిమచేత నెఱింగిరి.