Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లలితలోచనా జన్మవృత్తాంతము.

1239

డని ఉత్తముఁడు పుత్త్రుఁ డొక డుండెను. ఆవామదత్తుడు తండ్రికి కడు ననుంగై సకలవిద్యలును చక్కఁగా స్వల్పకాలముననే నేర్చి శశిప్రభయను కన్యం బెండ్లియాడెను. కాలక్రమమున తండ్రి స్వర్గస్థుఁడై తల్లియు సహగమనము సేయఁగా, వామదత్తుఁడు తనభార్యతోఁగూడ గార్హస్థ్యధర్మము నెఱవేర్చుకొను చుండెను. దైవయోగమున ఆతనిభార్య ఎవరివలననో శాకినీసిద్ధిం బొంది యతని యెఱుక లేక స్వేచ్ఛాచారిణి యై యుండెను. వామ దత్తుఁడు రాజసేవార్థము రాజథానికిఁ బోయి ఉండఁగా గ్రామమునుండి పినతండ్రి వచ్చి యతనితో ఏకాంతంబున 'నాయనా, మనకొంప మాసిపోయినది, నీభార్య నీదున్నలకాపరినే తగులుకొన్నది, 'నేనే కన్నులారఁ జూచితిని.' అని చెప్పెను.

ఈమాట విని, అతనిని రాజథానిలో తనకు బదులుగా నుంచి వామదత్తుఁడు కత్తియొక్కటియ తోడుగా తనయింటికి వచ్చి పూలతోఁటలో రాత్రి దాఁగి యుండెను. ఆవేళకే అచటికి దున్నలకాపరియు వచ్చెను. క్షణముసేపటికి శశిప్రభయు బాళి మీఱి పెక్కు లారగింపులు కేలఁ గొని తనవిటకాని నా దున్నలకాపరిం దఱిసెను. వాఁ డారగించిన తర్వాత వానితో నామె శయన మొందెను. ఇదియెల్లం గనుచుండి వామదత్తుఁడు 'చీ, పాపాత్మురాలా, ఎటకు తప్పించికొనిపోయెదరు?' అని యఱచుచు వారిమీఁదికి కత్తి దూసికొని పరువిడెను. భార్య కని లేచి 'చీ! చీ! నీచుఁడా?' అని యతని మొగమున రవంతఁ