1236
కథాసరిత్సాగరము. లం. 12. త. 1
వసించియుండెను. ఇట్లుండగా ఒకరాత్రి ఎవతో దివ్యకన్యక ఆకాశమార్గమున వచ్చి తన్నుఁ గొనిపోయినట్లు అతనికి స్వప్న మాయెను. మేలుకొని చూచుకొనునంతట తాను ఒకగొప్ప పర్వతసానువున చెట్లనీడలో గరుడమణి వేదికయం దుండెను. ఆకన్యయు మన్మథునిలోకసమ్మోహనౌషధియుంబోలే ఆరాత్రివేళ కాననమునెల్ల వెలిఁగించుచు తనపార్శ్వమున నుండెను.
అంత నాతండు త న్నటకుఁ దెచ్చినది యా చెల్వయే గదా యని తలంచి, ఆమెం గని, ఆమె సిగ్గుచేత నిజమనోరథమును నెఱవేర్చుకొనక తామసించిన దనియు నూహించి, తత్త్వము రూఢిసేయువాఁడై కపటనిద్ర నవలంబించి ధౌర్త్యంబున 'చెలియా, మదనమంచుకా, నీ వెచ్చట నున్నావు? రమ్ము ననుఁ గవుంగిలించుకొమ్ము.' అని పలవరింపం దొడంగెను. ఆపల్కు విన్న వెంటనే యాదివ్యాంగన ఆప్రస్తాపముచే జ్ఞప్తి చేసికొని, నానవలనియడ్డంకిం దొలంచు నుపాయంబుగా మదనమంచుకారూపముం దాల్చి, నరవాహనదత్తునిం గవుంగిలించెను. ఆతండును కనుఁగవం దెఱచి కేవలము తన ప్రియాస్వరూపముగానే యుండుటం గాంచి, ఆహాహా ! ఏమి యీ విద్యా నైపుణ్యము ! అని మనంబునం దలపోయుచు, మందహాససుందరాననుఁడై యామెకంఠముం గవుంగలించెను. అంత నామె లజ్జం దిగనాడి నిజరూపముం జూపి 'ఆర్యపుత్త్రుఁడా, నిన్ను స్వయముగా వరించిన నన్ను ఇపుడు పరిగ్రహింపుము.' అనెను.