Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలజాల కథ.

1033

నిశ్చయించుకొనిరి. ఈ వృత్తాంతమును విన్నజనులు 'మకరకటి జాలముచే ఎవని ధనము నెల్ల హరించినదో, వాఁడు బుద్ధిమంతుఁ డై ఆలముచే దాని సర్వస్వమును హరించినాఁడు. అది ఇతరులమీఁద జాలము చేయ నేర్చినదిగాని తనమీఁద ఇతరుఁడు చేసినయాలమును తెలిసికో నేరక పోయినది.' అని పలుకుచు నవ్వుచుండిరి. నష్టార్థయు పాటితాననయు నైన సుందరిని దాని జననిని ప్రాణత్యాగమునుండి స్వజనులు ఎట్టకేలకు నివారించిరి. ఈశ్వరవర్మ మహాధనమును ఆర్జించి స్వర్ణ ద్వీపమునుండి మరలి చిత్రకూటమున తండ్రియింటికిఁ బోయెను. కుమారుఁడు ఇట్లు అమితధనము నార్జించి రాఁగా రత్నవర్మ సంతోషించి ఆతని నభినందించి యమజిహ్వకు ధనము లిచ్చి మహోత్సవము చేసెను. ఈశ్వరవర్మయు సకలమాయ లెఱిఁగి, వారవిలాసినీ సంగమందు విరక్తుఁ డై, వివాహము చేసికొని ఇంట సుఖముగా నుండెను.

రాజేంద్రా, ఈరీతిని వార వనితా హృదయమందు కపటమే గాని సత్యము లేశ మయినను ఉండదు. కనుక సార్థ సాధ్యగమన లైన వారస్త్రీలయందు శూన్యాటవులయందుం బోలె భూతికాముఁడు గమింపఁ గూడదు.

ఇట్లని మరుభూతివలన ఈ యాలజాలకథను విని నరవాహనదత్తుఁడును గోముఖాదులును అంగీకరించి సంతసించిరి.