Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేలకథ.

1225

వేగ మెక్కువ యని యితని వాదము. వానిభేదమును కనిపట్టుటకు నీవు దక్క మఱియొక్కరుఁడు శక్తుఁడు కాఁడు. కనుక ఓరాజా, మాయింటి కేతెంచి యాపరీక్షం గావింపుము. నీవు యాచకులకు కల్పపాదపమవు, మేము దూరదేశమునుండి వచ్చిన యాచకులము.' ఇట్లు రుచిరదేవుఁడు ప్రార్థింపఁగా వత్సరాజకుమారుఁడు అంగీకరించి రుచిరదేవుఁడు రప్పించిన రథము నెక్కి వారితో వైశాఖపురమునకుం బోయెను. పౌర కాంతామణులు ఈతనిం జూచి రతీదేవిని బొందని మన్మథుఁడనియు, కలంకరహితుఁ డై పగటియందు సంచరించుచున్న చంద్రుఁడనియు, పురుషరూపమును ధరించిన కామ మనియు, స్త్రీలమనంబులను మూలచ్ఛేదము సేయుబాణ మనియు, వర్ణింపసాఁగిరి. అట నరవాహనదత్తుఁడు శృంగారరస స్థానభూతమగు మదనమందిరముం జూచి, రతీదేవితోడి యామన్మథునకు నమస్కరించి, విశ్రమించి, మార్గాయాసము వదలెను. అటుపిమ్మట నా సమీపమున రుచిరదేవుని భవనంబునకుం బోయి యాతని సత్కారము లందెను, ఉత్తమగజాశ్వములచే నొప్పెడు నాతని గృహముం జూచి వత్సరాజసుతుఁడు సంతసించెను. అచట పలువగల యుపచారము లొంది యారాజసుతుఁడు లోకసుందరి నాతని చెలియలింజూచెను. ఆరమణి రమణీయరూపము మానస మపహరింప నరవాహనదత్తుఁడు ప్రవాసకష్టమునుగాని స్వజన విరహమునుగాని తలంప కుండెను. ఆకన్యయు పూచిననల్లగలు