Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1202

కథాసరిత్సాగరము. లం. 10. త. 9.

నాఁడు ఆమూఢునికి దైవవశంబున భూలోకమునకుం బోయి బంధువులతో నచ్చటి యద్భుతములం జెప్పి మరలి రాఁ గోరిక గల్గెను. అంత నాతఁడు భూతలమునకు వచ్చు నా యెద్దుతోఁకను పట్టుకొని పుడమికిం బోయి మఠమునకుం జనియెను. ఇన్నా ళ్లెచ్చటికిఁ బోయితి వని మిత్త్రు లడిగిరి. అతఁడు తన కైలాస గమనమును మోదకభోజనమును జెప్పెను. అంతట వారు 'మిత్త్రుఁడా, మమ్ముం గూడ నచ్చటికిఁ గొనిపోయి యచ్చటి భక్ష్యముల భుజించునట్లు చేయుము.' అని వేడిరి. ఆతఁడు సమ్మతించి మఱునాఁడు వారి నందఱను ఆకొలని దరికి తీసికొని పోవునంత నా వృషభము నచ్చటికి వచ్చియుండెను. పూర్వానుభవమున తొలిమూఢుఁడు ఎద్దుతోఁకను పట్టుకొనెను. వాని పాదంబుల మఱియొకఁడు, వానిని మఱియొకఁడును, ఇట్లు గొలుసుగా నొకరి నొకరు పట్టుకొనిరి. అంత నందీశ్వరుఁడు ఆకసమున కెగిరెను. ఇట్లు తోఁకను బట్టిన మూఢపంక్తితో నంది ఆకసమునం జనునప్పుడు వారిలో నొకఁడు తొలిమూఢుని 'మిత్త్రమా, కైలాసమునందు ఎంతలేసి మోదకములు భక్షించితివి? నిజము చెప్పుము.' అని యడిగెను. అందుల కామూర్ఖ శిరోమణి రెండుచేతులను పద్మాకారంబుగా చేర్చి యింతలేసి యని చూపెను. అట్లు తోఁకను అతఁడు వదలినంతనే అందఱును నేలకు కుప్పగూలి మడిసిరి. నంది కైలాసంబునకుఁ