Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1200

కథాసరిత్సాగరము. లం. 10. త. 9.

చుండును, వెదకించి తెప్పించుకొమ్ము.' అని చెప్పి పోయెను. అంత నాజడుఁడు ఉపాధ్యాయుఁడు శిష్యులతో 'ఓరీ, ఇచ్చట మీరును మార్జారచిహ్నంబులు వింటిరి కదా, వీథులలో వెదకి తెండు.' అని యాజ్ఞాపించెను. శిష్యులు వల్లె యని వెడలి యిటునటుఁ దిరిగిరి. మార్జారముమాత్ర మెటను దొరకలేదు. కొంతసేపటికి పూర్వోక్త లక్షణ లక్షితుఁ డై వీఁపున జింకతోలు ధరించిన యొకవటువు అగపడెను. వానిని మార్జారంబని యుపాధ్యాయుని కడకుఁ గొనిపోయిరి. ఒజ్జయు మిత్త్రోక్తలక్షణలక్షితుని వటువును మార్జారంబ కాఁ దలఁచి రాత్రి మఠమున నిలిపెను. తెలివిమాలిన యావడుగు తనకు వారు పెట్టిన యా మార్జారనామమును యథార్థమునుగా నెంచి సుఖంబుండెను.' అంత నొకనాఁడు మార్జారముయొక్క గుఱుతులు చెప్పిన యుపాథ్యాయ మిత్త్రుఁడు యాదృచ్ఛికముగా నామఠమునకు చని యచ్చటివడుగుఁ జూచి 'ఓ శిష్యులారా, ఈతని నెవ్వరు ఇచ్చటికిఁ గొనివచ్చిరి?' అని యడిగెను. 'మీరు చెప్పిన గుఱుతులంబట్టి యీమార్జారమును మేము తెచ్చినారము.' అని శిష్యులు నుడివిరి. అందుల కాతఁడు వెఱఁ గంది 'ఓరి మూడులారా, బ్రాహ్మణుఁ డెక్కడ, తిర్యగ్జంతు వగు మార్జార మెక్కడ! నాలుగుకాళ్లు కలిగి యుండునది మార్జారము!' అని చెప్పెను. అంతట శిష్యులు వటువును విడిచిపెట్టి మరల