Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బోధిసత్త్వాంశభవుని కథ.

1195

యావృత్తాంతము తనదొరసానికి రాణికి చెప్పెను. స్వర్ణచూడపక్షి రాణి యింటినుండి రాణి చూచుచుండఁగానే యుక్తిగా ఆభరణకరండమును మున్ను కొనిపోయినది. ఇప్పుడు రాణి ఆయాభరణము మరల తననగరమునకు వచ్చియున్న వృత్తాంతముసు ఆస్త్రీవలన విన్నదై, రాజుతో చెప్పెను. రాజు ఆశఠయే కాన్పింపఁగా బోధిసత్త్వు నాతని సాభరణుని బంటులం బంపి ముసలి యామెయింటినుండి కట్టించి తెప్పించెను. రాజు అతనిమాట నిజమ యని తలంచియు ఆభరణమును హరించియు కట్లు విప్పింపకయే యుంచెను.

అట్లు బంధనస్థుఁ డై యాతఁడు మునికుమారావతార మైన యాపామును తలఁచుకొనెను. పాము వచ్చి వృత్తాంత మడిగి తెలిసికొని బోధిసత్త్వునితో “ఓయి సాధూ, నేనుపోయి సిగవఱకు ఈరాజును చుట్టుకొనియెదను, నీవు వచ్చి విడువు మను వఱకు విడువను. 'సర్పమునుండి రాజును నేను విడిపించెదను.' అని నీ విటం బలుకుము. నీవు రాఁగానే నీమాటమీఁద నేను రాజును విడిచెదను నేను విడిచినంతట ఈ రాజు నీకు తనరాజ్యము సగ మిచ్చి వేయును.” అని చెప్పి వెంటనే పోయి పామై రాజును చుట్టుకొని యాతనినెత్తిపై మూఁడుపడగలం బెట్టుకొని యుండినది. 'అయ్యో! అయ్యో! రాజును పాము కఱచినది!' అని జనులు ఘోషపెట్టసాగిరి. 'నేను పామునుండి రాజును రక్షించెదను.' అని బోధిసత్త్వుఁడు వచించెను.