Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1182

కథాసరిత్సాగరము. లం. 10. త. 8.

నాయందు దయచేయుము, నీకు ప్రతిదినము కలుగువిషయమున ఒకనాఁటి కేమి నష్టి!' కుష్ఠి 'అట్లే కానిమ్ము, నావేషమును నీవు గైకొని నీవేషమును నాకిమ్ము. నావలె కాలుసేతులు గుడ్డతోఁ గప్పుకొని ఇచటఁ గూర్చుండుము. చీఁకటి ప్రబలఁగానే దాసి వచ్చును. నన్నుఁగా నెంచి నిన్ను వీఁపునఁ గొనిపోవును. నేను పాదవైకల్యముచే సదా ఆతీరున అచటికి పోవుదును.' అని చెప్పెను. శశియు వానివేషము వేసికొని యచట నుండెను. అతనిసహాయు లిరువురును కుష్ఠియు దూరమున నుండిరి. ఇంతలో దాసివచ్చి కుష్ఠి వేషుని శశిని కని కుష్ఠినిగాఁ దలంచి రమ్మని వీఁపున నెక్కించుకొని తన దొరసానికడకు కొనిపోయెను. ఆమెయు భూగృహాంతరమున కుష్టిజారుని ఎదురు సూచుచుండెను. అచట అంధకారములో దుఃఖించుచుండిన యామెను అంగస్పర్శ చేత తనభార్యయే అని తెలిసికొని శశి వైరాగ్యము పొందెను. ఆమె నిద్రించినపిమ్మట శశి అలక్షితముగా వెలువడి ధనదేవ రుద్రసోముల కడకు వచ్చి వారికి తన వృత్తాంతమును తెలిపి ఖిన్నుఁ డై 'అయ్యో! అయ్యో ! స్త్రీలు నీచాభిపాతినులు, లోలలు, దూరమున మనోరమలు, సుక్షోభ్యలు, శ్వభ్రాపగల వలె రక్షింప శక్యలుగారు. భూగృహములలో నుంచినను నాభార్య కుష్ఠిని పొందినది కావున నాకుఁ గూడ వనమే మేలు. ఇసీ! ఇ ల్లేల! ' అని సమదుఃఖు లైన యావిప్రవణిజులతోఁ గూడ ఆ రాత్రి గడపెను.