Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధనదేవభార్య కథ.

1177

పించెను. ఆచాటింపు విని ఘటుఁడు బయలు వడఁగోరెను. 'వలదు, రాజును నమ్మవలదు మోసమున నమ్మించి రాజు నిన్ను చంపును.' అని రాజపుత్త్రి బోధింపఁగా ఘటుఁడు మానుకొనెను. పిమ్మట తనరహస్యము బయలువడు నని వెఱచి ఘటుఁడు రాజు పుత్త్రితోను ప్రవ్రాజకునితోను దేశాంతరము పోయెను. దారిలో రాజపుత్త్రి ప్రవ్రాజకునితో రహస్యమున నిట్లనియె: 'ఒకఁడు, నన్ను ధ్వంసము చేసెను. ఈ రెండవవాఁడు నన్ను నాచోటినుండి వెలికి తెచ్చెను. ఆదొంగ చచ్చెను. వీఁడు ఇంక చావలేదు. నీవు నాకు కడుం బ్రియుఁడవు.' ఇట్లు హెచ్చరించి వానితోఁగూడ ఘటుని విషముపెట్టి చంపెను.

ధనదేవభార్య కథ.

పిమ్మట ఆపాపాత్మురాలు ప్రవ్రాజకునితో పోవుచు ధనదేవుఁ డనువర్తకుని దారిలోఁ గలసి 'వీఁ డేల కాపాలికుఁడు? నాకు నీవు ప్రియుఁడవు.' అని వణిజుని బోధించి నిద్రించుచున్న ప్రవ్రాజకుని వదలి వణిజునితో పోయెను. ప్రవ్రాజకుఁడు తెల్లవాఱఁగానే మేల్కొని రాజకన్య పోయిన దని యెఱిఁగి 'స్త్రీలకు చాపలము తప్ప స్నేహము గాని విశ్వాసము గాని లేదు. ఈ పాపాత్మురాలు నన్ను నమ్మించి నాధనమును కూడ హరించి పలాయిత యైనది. ఘటునివలె చంపక నన్ను వదలుటయే నాకు లాభము.' అని యాలోచించుకొని తన దేశమునకుఁ బోయెను. రాజసుతయు వణిజునితోఁగూడ అతని దేశమునకుఁ బోయెను.