Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలజాల కథ.

1027

నట్లు చేయుఁడు. నాకు కాఁగలది అగును.' అని పలికెను. 'పిల్లా, ఏడువకు; ధైర్య మవలంబింపుము. నీ ప్రియుఁడు కార్యము తీర్చుకొని మరల నీయొద్దకు వచ్చును. పిమ్మట నిన్ను వదలఁడు.' అని తల్లి ఓదార్చెను. సుందరి పిమ్మట తల్లితో కలియఁబలికికొన్న దై ఈశ్వరవర్మ పోవుదారిలో ఒక నూతిలో వల పన్నించెను. ఈశ్వరవర్మ దుఃఖముచే ఏమియు తోఁపక యుండెను. సుందరియు దుఃఖముచేతనుంబోలె ఆహార పానములను కొంచెకొంచెముగా గ్రహించెను, గీతవాద్యనృత్యములను మానెను. ఈశ్వరవర్మ దానిని నానాప్రణయములచే ఓదార్చెను.

పిమ్మట మిత్త్రుఁ డేర్పఱిచిన దినమున ఈశ్వరవర్మ కుట్టని చేసిన మంగళముతో సుందరీ గృహమునుండి తరలెను. తల్లిని దోడ్కొని సుందరియు కన్నీళ్లువిడుచుచు ఊరి వెలుపల వల పన్నిన నూతివఱకు సాగ నంపి, అచట తాను ఆ బావిలో దుమికెను. 'అయ్యో ! సుందరీ, అయ్యో ! పుత్త్రీ' అని భృత్యవర్గమును తల్లియు మొఱ పెట్ట సాగిరి. ఆ కోలాహలమునకు ఈశ్వరవర్మ మిత్త్రులతోఁగూడ మరలి వచ్చి నూతిలోఁ బడియున్న సుందరిని చూచి మూర్ఛితుఁ డాయెను. తెలివి రాఁగానే మకరకటి పలవించుచు తన నౌకరులను తన రహస్య మెఱిఁగినవారిని ఆప్తులను నూతిలో దింపి సుందరిని వెలికి తీయించెను. వారును త్రాళ్లతో దానిని 'ఆహా బ్రదికియున్నది!