Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్దభాఖ్యాయిక.

1163

ఆక్షేపించెను. 'క్షుద్రమును గాడిదను కూడ కొట్ట లేవైతివి, హరిణాదులను కొట్టవలసిన ఏమి చేయుదువు!' సింహము మంత్రితో 'అంతయు నీ వెఱుఁగుదువు, మరల ఆగాడిదను తోడ్కొని రమ్ము, సిద్ధముగా నుండి కొట్టెదను.' అనెను.

అంతట నక్క మరల గాడిదయొద్దకుఁ బోయి 'ఏమి? మామా, పలాయన మైతివే? ' అని యడిగెను. 'నన్ను ఏదో జంతువు కొట్టినది.' అని గాడిద చెప్పెను. నక్క నవ్వి 'నీకు వట్టి భ్రమ కలిగినది. అచట అట్టిసత్త్వమే లేదు. నేను కూడ నిచట నిర్భయముగా నున్నాఁడను, రా నాతోఁగూడ నిర్బాధ మయిన యీయడవిలోనికి.' అని పిలిచెను. అట్లే గాడిద మరల దానితో వచ్చెను. రాఁగానే గాడిదను చూచి సింహము గుహ వెలువడి వీఁపుపైఁ బడి గోళ్ల తో చీల్చివేసెను. ఇట్లు గాడిదను చీల్చి పడ వేసి నక్కను కావలి యుంచి సింహము బడలిక తీర్చుకొనుటకై స్నానము చేయఁ బోయెను. అది మరల వచ్చు నంతలో మాయావి నక్క గాడిదయొక్క చెవులను గుండెను తినెను. సింహము స్నాన మై వచ్చి గాడిదను చూచి చెవులును గుండెయు నేవీ?' అని నక్క నడిగెను. నక్కయు 'ప్రభూ, ఇది పూర్వమే కర్ణహృదయ హీనముగా నుండెను, కా దేని ఇది పోయి మరల వచ్చునా?' అనెను, సింహము అట్లేయుండు నని తలఁచి ఉన్నమాంసమును భక్షించెను. నక్క తచ్ఛేషము భక్షించెను. -