Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యశోధరలక్ష్మీధరుల కథ.

1157

డొక పురుషుఁడు దిగి వచ్చెను. అతనికి వారు నమస్కరించిరి. అతఁడు వారిని కుశల మడిగి కూర్చుండెను. నీ వెవర వని వారతని నడిగిరి. అంత నాపురుషుఁడు పలికెను: - 'పూర్వము నేను బ్రాహ్మణుఁడను దరిద్రుఁడనుగా నుంటిని. నాకు దైవవశమున శ్రమణులతో సాంగత్యముగలిగి వారిశాస్త్రమందలి యుపోషణ వ్రతమును ఆచరించు చుంటిని. ఒకనాఁడు సాయంకాలమున శఠుఁ డొకఁడు నన్ను బలవంత పెట్టి భోజనము చేయించెను. అందువలన నావ్రతము ఖండిత మై నేను యక్షుఁడ నైతిని. నావ్రతమే పూర్ణ మై యుండెనేని స్వర్గమందు దేవతనుగాఁ బుట్టి యుందును. నాకథను చెప్పితిని. మీకథ యేమి? మీరు ఎచటినుండి యెచటికి బయలు వెడలినారు? ఈమరుభూమి ఏల చొచ్చినారు?' - యశోధరుఁడు తమ వృత్తాంతము చెప్పెను. యక్షుఁడు వారితో మరల ననియె. - 'అటయిన, నేను మీకు నాప్రభావము చేత విద్యల నిచ్చెదను. విద్యలు గ్రహించి స్వదేశమునకు పొండు, ఊరక విదేశ భ్రమణ మేల చేసెదరు?' ఇట్లు పలికి అతఁడు వారికి అప్పుడే విద్యల నిచ్చెను. వారును అతని ప్రభావముచేత విద్యలను తత్క్షణమే గ్రహించిరి. అంత నతఁడు వారితో 'మిమ్ము గురుదక్షిణగా ఒకటి యడిగెదను. ఏ మనఁగా మీరు నాకొఱకు ఉపోషణవ్రతము చేయవలయును. సత్యము, బ్రహ్మచర్యము, దేవప్రదక్షిణము, భిక్షువేళయందు భోజనము, మనస్సంయమము, క్షమయు ఒకదినము జరిపి ఆఫలము నాక