యశోధరలక్ష్మీధరుల కథ.
1155
నదియుంబోలె నొకటి వెలఁగుచుండును. అందు కైలాసశ్వేత ద్వీపముల యందలి తమనివాసమును మఱచి శివాచ్యుతులు నూర్లకొలఁది పుణ్యక్షేత్రములయందు నివసించియున్నారు. ఆదేశము వితస్తానదీజలముచే పవిత్ర మై శూరవిద్వజ్జనసమృద్ధ మై ఎట్టిబలవంతుల కైనను శత్రువులకు జయింపరానిదై యున్నది. అచట పూర్వజన్మమున నే నొకగ్రామమున సామాన్య బ్రాహ్మణపుత్త్రుఁడనుగా నుంటిని ! నాకు ఇరువురుభార్య లుండిరి. నాకు ఒకప్పుడు శ్రమణులతో సాంగత్యము కలుగఁగా వారు తమశాస్త్రమందు చెప్పఁబడిన యుపోషణ వ్రతమును నాకు నేర్పిరి. ఆవ్రతమును నేను ఇంచుమించుగా ముగింప నుండఁగా నాభార్యలలో నొకతె పాపాత్మురాలు బలాత్కారముగా వచ్చి నాశయనమందు పరుండి నిద్రించెను. నాలవజామున నేను ఆవ్రతమును మఱచి నిద్రామోహముచే దానితో సురత మనుభవించితిని. ఆవ్రతమునకు అంతమాత్రమే భంగము కలిగినందున నే నిట్లు జలపూరుషుఁడనుగా జనించితిని. ఆయిరువురుసు ఈనాభార్యలుగా జనించినారు. ఆకులట పాపాత్మురాలు ఒకతె, రెండవది ఈతరుణి. నావ్రతము ఖండితమైనను దానిప్రభావమున పూర్వజన్మజ్ఞానమును, రాత్రి రాత్రి యిట్టి భోగములును కలిగినవి. వ్రతమునకు భంగమే రాక యుండిన నాకు ఇట్టియల్పజన్మము వచ్చి యుండదు. -