Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1154

కథాసరిత్సాగరము. లం. 10. త. 7.

కనుము." - ఇట్లు పలికి ఆమె ఆచెట్టును కోపముతో చూచి భస్మము చేసెను ; మరల దానినే దయతోఁ గని మునుపటికంటె చక్కనిదానినిగాఁ జేసెను. అది గని భర్త సంతోషించి ఆమెను కౌఁగిలించుకొనెను. రెండవదానిని చెనఁటియాలిని ముక్కుకోసి తఱిమివేసెను. దానివస్త్రమునుండి యుంగరములను కైకొని, అధ్యయనపాఠకుని యశోధరుని భ్రాతృసమేతుని మంచిమాటల క్షమ వేఁడి, నిర్విణ్ణుఁ డై అతనితో పలికెను. 'అయ్యా, ఈర్ష్యావశమున ఈభార్యల నిరువురును హృదయములో దాఁచుకొని రక్షించుచుంటిని. అటయినను ఈపాపాత్మురాలిని రక్షింపనేర నైతిని, మెఱపుఁదీఁగను ఎవఁడు కదలకుండఁ జేయును ? చపలస్త్రీని ఎవఁడు రక్షించును! పతివ్రత తన శీలముచేత తన్ను తాను రక్షించుకొనవలయును గాని !' ఇట్లు పలికి యశోధరుని కూర్చుండఁ బెట్టి 'ఎచటినుండి వచ్చుచున్నారు? ఎచటికి పోవుచున్నారు ?' అని యడిగెను. యశోధరుఁడు తనవృత్తాంతము చెప్పి విశ్వాసము కలుగుడు అతని వృత్తాంత మడిగెను. 'అయ్యా, మహానుభావుఁడా రహస్యము గాదేని చెప్పుము. నీవు ఎవరవు? నీకు ఇట్టి భోగము కలిగియు ఈజలవాస మేమి ?' చెప్పెదను విను మని జలవాసి యిట్లు తనవృత్తాంతమును చెప్పసాగెను.

హిమవంతమునకు దక్షిణమందు కాశ్మీర మని దేశము మనుష్యులకు స్వర్గసౌఖ్యము కలిగించుటకు బహ్మ సృజించి