1150
కథాసరిత్సాగరము. లం. 10. త. 7.
7 - వ తరంగము.
పిమ్మట తెల్లవాఱఁగానే మేల్కొని నరవాహనదత్తుఁడు ప్రియతమను శక్తియశను ధ్యానించుచు వ్యాకులుఁ డై యుండెను. ఆమెతోడి వివాహమునకు ఏర్పడి యున్న నెలగడువులో శేషించిన దినములను యుగసమానముగా భావించుచు మిగుల క్లేశపడుచుండెను. ఆవిషయమును గోముఖునివలన విని వత్సరాజు పుత్త్రస్నేహముచే తన మంత్రులను వసంతకసమేతముగా నరవాహనదత్తుని యొద్దకు అతని వినోదముకై పంపెను. వారి యందలి గౌరవముచే నరవాహనదత్తుఁడు కొంచెము ధైర్యము తెచ్చుకొని యుండఁగా బుద్ధిమంతుఁడు గోముఖమంత్రి వసంతకుని యువరాజుమనస్సునకు తుష్టి యగునట్లుగా మంచి క్రొత్తకథను చెప్పు మనెను. వసంతకుఁడు కథ చెప్ప నారంభించెను.
యశోధరలక్ష్మీధరుల కథ.
మాళవదేశములో శ్రీధరుఁ డని ప్రసిద్ధుఁడు బ్రాహ్మణోత్తముఁ డుండెను. ఆయనకు ఇద్దఱు కవలవాండ్రు పుట్టిరి. పెద్దవాని పేరు యశోధరుఁడు, చిన్నవానిపేరు లక్ష్మీధరుఁడు. ఆయిరువురును యౌవనవంతులై విద్యాగ్రహణార్థము తండ్రియనుజ్ఞ వడసి కలసి దేశాంతరము పోవుచుండిరి. క్రమముగా దారి నడచుచు వారు నీరు గాని చెట్టునీడ గాని లేక సర్వము కాలు