Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వైద్యుఁడు, మఱుగుజ్జు.

1149

అచట వాఁడు చక్రవాకమువలె కూయసాగెను. రాజు వానిని స్వయముగా మంచిమాటగా అడుగఁగా ఆ మూర్ఖుఁడు నిజవృత్తాంతమును చెప్పెను. రాజు కనికరించి విడిచిపెట్టెను.

వైద్యుఁడు, మఱుగుజ్జు.

ఒక బ్రాహ్మణునికి మఱుగుజ్జువాఁడు కుమారుఁ డొక డుండెను. ఆయన వైద్యు నొకని మూర్ఖుని పిలిచి తనకుమారుని గూనును లోపలికి త్రోసివేయు మని యడిగెను. 'నాకు పదిపణములు ఇమ్ము, దీనిని సాధింపలేనేని పది రెట్లు నీ కిచ్చెదను.' అని వైద్యుఁడు ప్రతిజ్ఞ చేసెను. అనంతరము పదిపణములు బ్రాహ్మణునివలన పుచ్చుకొని వైద్యుఁడు ఆపిల్లవానిని స్వేదనాది వైద్యక్రియలచేత మిక్కిలి గాసిపెట్టెను. ఏమి చేసినను వంపు తీఱ దాయెను. అంతట వైద్యుఁడు పదిరెట్ల ధనమును బ్రాహ్మణుని కిచ్చి వేసెను. గూను తీర్చుట ఎవనితరము ? ఈరీతిగా అసాధ్య కృత్యమును సాధింపఁబూనువారు పరిహాసమును పొందుదురు. ఇట్టి మూఢమానవులతో బుద్ధిమంతుఁడు సహవాసము చేయఁగూడదు.

ఇట్లు గోముఖ సచివునివలన రాత్రి కథలను విని నరవాహనదత్తుఁడు సంతోషించి శక్తియశస్సముత్సుకుఁ డైనను తత్కథావినోదముచేత మిత్త్రసమేతముగా నిద్రాభిముఖుఁ డై శయనీయము భజించెను.