ఆలజాల కథ.
1023
'వేశ్య యనఁగా లోకములో యౌవనాంధుల ధనప్రాణములను హరింపు మని బ్రహ్మదేవుఁడు మూర్తిమతిగా చేసిన నికృతి కనుక ఈ కుమారుని ఒకకుట్టనికి అప్పగించి, వేశ్యలకు వీఁడు లోఁబడ కుండునట్లు వారిమాయలను నేర్పించెదను.' ఇట్లాలోచించి రత్నవర్మ కుమారునిఁ దోడ్కొని యమజిహ్వ యను పేరి కుట్టని యింటికి పోయెను. అచట కొమారితకు ఆటనేర్పుచున్న యా కుట్టనిని, లావు లైన చెక్కిళ్లు పెద్ద దంతములు చప్పిముక్కు గలదానిని, కనెను. ఆ ముసలిది కొమారితకు 'పుత్త్రీ, వేశ్యాజన మెల్ల ధనముచే గౌరవము పొందును. ఆనురాగము గలదానికి ధనము దొరకదు. కనుక వేశ్య రాగము మానవలయు, రాగము వేశ్యకును పశ్చిమసంధ్యకును దోషాగ్రదూతగా నున్నది. సుశిక్షిత యైన నటివలె వేశ్య మిథ్యారాగమునే చూపును. ఆ మిథ్యారాగముచే అది ముందుగా కాముకుని రంజించి, పిమ్మట రంజితుని ధనము నెల్లను పిదికి వేయును. రిక్తుఁ డైన వెంటనే వానిని త్యజించును. మరల పూర్ణుఁ డాయెనా మరల వానిని గ్రహించును. యువ శిశు విరూప వృద్ధ రూపవంతులయందు వేశ్యాజనము మునివలె సమముగానుండి అర్థమునే పరముగా గ్రహించుచుండును.” అని నేర్పు చుండెను. అట్లున్నట్టి యాకుట్టనియొద్దకుఁ బోయి రత్నవర్మ సత్కృతుఁడై కూర్చుండి 'ఆర్యా, ఈ నాపుత్త్రునికి వేశ్యాకళలను నేర్పుము, అందువలన వీనికి తెలివి గలుగును.