కాకోలూకీయము.
1125
6 - వ తరంగము.
మఱునాఁడు సూర్యోదయమున నరవాహనదత్తుఁడు తండ్రిగారి దర్శనమునకు పోయెను. అచటికి పద్మావతీదేవి భ్రాత మగధేశకుమారుఁడు సింహవర్మ స్వనగరమునుండి వచ్చియుండ నరవాహనదత్తుఁడు ఆయనను కుశల మడుగుట మొద లయిన గోష్ఠియందు ఉండి అచటనే భుజించి సాయంకాలమున తనయింటికిఁ బోయెను. అచట శక్తియశనే తలఁచుకొని ఉత్కంఠితుఁడై యుండెను. అంత నతనిని వినోదవఱుచువాఁడై మరల గోముఖుఁడు చెప్పసాగెను.
కాకోలూకీయము.
ఒకానొకచోట విశేషము నీడ గలది గొప్ప మఱ్ఱిచెట్టు పక్షుల కలకలముచేత పథికులను విశ్రామార్థము పిలుచునది వోలె నొప్పు చుండెను; అందు మేఘవర్ణుఁ డను కాకరాజు గూఁడు కట్టుకొని నివసించియుండెను. దానికి అవమర్దుఁ డనుపేరి గ్రుడ్లగూబరాజు శత్రు వుండెను. అది రాత్రి కాకిఱేని పరివార మైన కాకుల ననేకములను సంహరించి పోయెను. తెల్లవాఱఁగానే కాక రాజు మంత్రులను ఉడ్డీ వ్యాడీవి సండీవి ప్రడీవి చిరజీవులనువారిని రప్పించి సగౌరవముగా 'మంత్రి పుంగవులారా, మన శత్రువు ఈరీతిగా వచ్చి మనలను ఓడఁ గొట్టి పోవుచున్నాఁడు.