1114
కథాసరిత్సాగరము. లం. 10. త. 5.
అంతట భార్య కౌతుకముచేత ధవళముఖుని 'ఆర్యపుత్త్రా, కల్యాణవర్మ నీకు గొప్పసత్కారము చేసినాఁడు, వీరబాహువు నీకు స్వాగతముమాత్రము పలికినాఁడు, అతనికంటె ఇతఁడెక్కువమిత్రుఁ డని తలంతు వెట్లు?' అని అడిగెను. 'ప్రేయసీ, అట్లయిన, నీవు పోయి అబద్ధమే వా రిరువురతోను రాజు మా మీఁద కోపగించినాఁడని చెప్పుము. అంతట నీవు స్వయముగా ఇరువుర తారతమ్యమును ఎఱుఁగుదువు.' అని ధవళముఖుఁడు చెప్పెను. భార్యయు పోయి కల్యాణవర్మతో అట్లు చెప్పఁగా, 'అమ్మా, నేను వణిక్కుమారుఁడను, రాజున కేమి చేయఁగలను చెప్పుము.' అని కల్యాణవర్మ పలికెను. పిమ్మట ఆసుందరి వీరబాహువునొద్దకు పోయి అట్లే చెప్పెను. అతఁడు విన్న వెంటనే డాలు కత్తియు చేతఁగొని వీరియింటికి వచ్చెను. అంతట ధవళముఖుఁడు వానిని 'మిత్త్రమా, రాజు మంత్రులమాటవలన అలుక మానినాఁడు, కనుక మఱి యేమియు విశేషము లేదు. ఇంటికి పొమ్ము.' అని ఇంటికి పంపి వేసి, 'చూచితివా? ఇది ఆయిరువురలోను భేదము.' అని భార్యను హెచ్చరించెను. ఆమెయు సంతోషించెను. ఇట్లు ఉపచారమిత్త్రము వేఱు, సత్యమిత్త్రము వేఱు, జిడ్డు సమానమే అయినను, నూనె నూనె, నేయి నేయి, మరల గోముఖమంత్రి నరవాహన దత్తునికి మూర్ఖులకథలను చెప్పసాగెను.