1112
కథాసరిత్సాగరము. లం. 10. త. 5.
ఆదారిని ముని ఒకఁడు రాఁగా, రాజు అతనిపాదములకు ప్రణమిల్లి మరల నేనుఁగు నెక్కి తన యింటికి పోయెను. దానిం గని రాజుకంటె మునియే ఉత్కృష్టుఁడని తలఁచి చండాలకన్య మునివెంటఁ బడెను. మునియు పోవుచు దారిలో శూన్యశివాలయమును గని నేల మోఁకా ళ్లూఁది శివవందనము చేసి నడచెను. దానం గన్నియ మునికంటె శివుఁడే అధికుఁ డని తలఁచి మునిని మాని భర్తృబుద్ధితో శివునే ఆశ్రయించి అచటనే యుండెను. క్షణములో అచటికి కుక్క యొకటి వచ్చి దేవునిపీఠము నెక్కి శివలింగముమీఁద కాలెత్తి తన జాత్యుచితము చేసి పోయెను. అంతట చండాలకన్యక దేవునికంటె కుక్కయే యుత్తమ మని పతిబుద్ధిచే ఆ కుక్కవెంటఁ బోయెను. కుక్కయు ఒక చండాల గృహమునకుఁ బోయి అచట పరిచితుఁడయిన చండాలతరుణుని పాదములలోఁ బడి ప్రేమచే దొరల సాగెను. అంతట చండాలకన్య కుక్కకంటె చండాలకుమారుఁడే ఉత్తముఁ డని స్వజాతి తుష్టయై వానిని పతిగా వరించెను. ఈ ప్రకారము దూరమున అడుగు పెట్టు మూర్ఖులు తమచోటనే పడుదురు.
మూర్ఖరాజు.
మూర్ఖరాజుకథ వినుము. మూర్ఖుఁడు రా జొకఁడు ధనవంతుఁ డైనను లోభి యై యుండెను. మంత్రులు ఒకనాఁడు హితార్థము అతనిని 'దేవా, దానము పరలోకదుర్గతిని పోఁగొట్టు నని పెద్దలు చెప్పుదురు. కావున దానములు చేయుము.