ప్రభాసుని పూర్వచరితము.
793
తత్క్షణమే దానిని చేయుము నీవు పోయి నముచిని ఆ గుఱ్ఱము నడుగుము. శత్రువ వైనను నీవు యాచించిన అతఁడు గుఱ్ఱమును ఇయ్యక మానఁడు. ఆజన్మ సంచిత మయిన దాతృతాకీర్తిని పోఁగొట్టుకొనఁడు.' గురు విట్లు చెప్పఁగా ఇంద్రుఁడు వెంటనే దేవతలతోఁ గూడ పోయి నముచిని ఆ గుఱ్ఱమును యాచించెను. 'నా యర్థి పరాఙ్ముఖుఁ డయి పోఁడు. అందులోను వాసవుఁడా పోవును ? నేను నముచి నై యితనికి గుఱ్ఱమునా ఇయ్యకుందును? లోకములలో నేను చిరకాలము ఆర్జించి యున్న దాతృతాకీర్తి వాడిపోవు నెడల, నాసిరి యేల ప్రాణ మేల ?' అని ఆలోచించి ఆ మహానుభావుఁడు నముచి శుక్రాచార్యులచే నివార్యమాణుఁ డయ్యును ఆహయవతం సమును ఇంద్రునికి ఇచ్చెను. హయమును గ్రహించి విశ్వాసము పుట్టించి శస్త్రాద్యవధ్యుని నముచిని ఇంద్రుఁడు వజ్రన్యస్తమయిన గంగాఫేనముతో చంపెను. ఆహా ! సంసారములో ఈభోగతృష్ణ ! దానివలన ఆకర్షింపఁబడినవారై దేవతలు కూడ అనౌచిత్యాకీర్తులకు భయపడరు ! దాని నెఱిఁగి సముచితల్లి దనువు శోకసంతప్తురాలై దుఃఖశాంతి కొఱకు 'అతఁడే నముచియే మరల నాగర్భమున బలవంతుఁ డై పుట్టి యుద్ధములో సర్వదేవతలకును అజయ్యుఁడు అగును గాక.' అని సంకల్పము చేసెను. అంత నాయసురుడు ఆమె కడుపున సర్వరత్నమయుఁడై పుట్టి బలయోగముచేత ప్రబలుఁ డని పేర్కొనఁబడెను.