Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

776

కథాసరిత్సాగరము. లం. 8. త. 3

కలాపగ్రామ మనుపేరి ప్రదేశ మున్నది. అచట నిలిపి యీ బలము నంతయు ఒక్కదృష్టిలోనే చూడవచ్చును.' అని మునికుమారుఁడు పలికెను. అంతట అందఱును ఆకుమారుని సుమేరువును వెంటఁగొని కలాపగ్రామమునకు పోయిరి అచట ఉన్నతస్థానస్థితులై వారు వేర్వేఱుగా అనుగులసేనలను రాజులసేనలను నిలిసి చూచిరి. అపుడు సుమేరువు పలికెసు. - శ్రుతశర్మకు బలము ఎక్కువ. అతని పక్షములో నూటయొక్కరు విద్యాధరాధీశ్వరులు ఉన్నారు. వారిలో ఒక్కొక్కఁడును ముప్పదియిద్దఱు రాజులకు అధిపతి. కానిమ్ము, వారిలో కొందఱను భేదోపాయముచే నీతో చేర్చెదను. అందులకై ఱేపు ప్రాతఃకాలమున వల్మీకనామక మయిన ప్రదేశమునకు పోవుదము. ఱేపు తిథి ఫాల్గున బహుళపక్షాష్టమి గదా. నాఁడు అచట చక్రవర్తిలక్షణ మయినయొక యమ్ములపొది యుత్పన్న మగును. దానికై అచటికి నాఁడు విద్యాధరులు పోవుదురు.'

సూర్యప్రభుఁడు దివ్యతూణీరమును సాధించుట.

అందఱుసు ఆదినము సైన్య సంవిధానములోఁ గడపి మఱునాఁటి యుదయమున రథ బల సమేతులై వల్మీకమునకు పోయి అచట హిమవంతముయొక్క దక్షిణసానువున సైన్య ఘోషముతో విడిసిరి. అచటికి విద్యాధరేశులు అనేకులు వచ్చి, కుండములలో అగ్నిని జ్వలింపఁ జేసి, కొందఱు హోమమును కొందఱు జపమును ఆరంభించిరి. సూర్యప్రభుఁడును గొప్ప